కరోనా కట్టడిలో విఫలమైన కొన్ని రాష్ట్రాలు.. ప్రజల దృష్టిని మరల్చడానికి, వారిలో భయాందోళనలను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు కేంద్ర ఆరోగ్యమంత్రి డాక్టర్ హర్షవర్ధన్. మహారాష్ట్రలో కరోనా టీకాల కొరత ఉన్నట్లు కొందరు ప్రజాప్రతినిధులు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. అర్హులకు సరిగా టీకాలు వేయకుండా, అందరికీ వ్యాక్సిన్ అందించాలని డిమాండ్ చేస్తూ.. ప్రజల్లో భయాలను పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
"కొవిడ్ టీకా కొరత ఉన్నట్లు మహారాష్ట్ర చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. కరోనా పరీక్షలను తగినంతగా నిర్వహించడం లేదు. రాష్ట్ర సర్కార్.. సంస్థాగత నిర్బంధాన్ని తప్పనిసరి చేయకుండా ప్రజలను ప్రమాదంలోకి నెడుతోంది. మొత్తం మీద సంక్షోభం నుంచి తప్పించుకుంటోంది."
- డాక్టర్ హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్య మంత్రి