తెలంగాణ

telangana

ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు.. ఒవైసీపై యూపీలో కేసు

By

Published : Sep 10, 2021, 1:11 PM IST

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై ఉత్తర్​ప్రదేశ్​లో కేసు నమోదైంది. ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన 'మత సామరస్యాన్ని దెబ్బతీశారు, కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారు, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు' అని పోలీసులు ఆరోపించారు.

Owaisi
Owaisi

కరోనా నిబంధనల ఉల్లంఘనతో పాటు.. మత సామరస్యాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు కేసు నమోదు చేశారు. 'కాట్రా చందనలో ఆయన నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పెద్దఎత్తున జనసమీకరణ జరిగింది. మాస్కులు, భౌతిక దూరం నిబంధనలు ఉల్లంఘించారు' అని పోలీసులు తెలిపారు. '100 ఏళ్ల నాటి రామ్ సనేహి ఘాట్ మసీదు వ్యవహారంపై అసత్య ఆరోపణలు చేశారని బారాబంకి ఎస్పీ తెలిపారు.

ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న ఒవైసీ

"ప్రభుత్వం కూల్చేసినట్లు ఒవైసీ ఆరోపిస్తున్న పాత మసీదు మరో ప్రాంతంలో ఉంది. ఈ నిర్మాణం చట్టవిరుద్ధమని జిల్లా మేజిస్ట్రేట్ ప్రకటించారు. అలహాబాద్ హైకోర్టు లఖ్​నవూ బెంచ్ తీర్పు ప్రకారమే దానిని ప్రభుత్వం కూల్చేసింది. అయితే మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ఒవైసీ ప్రయత్నించారు. ప్రధానితో పాటు ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రిపై అనుచిత, నిరాధార వ్యాఖ్యలు చేశారు."

-యమునా ప్రసాద్, బారాబంకి ఎస్పీ

'మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత్​ను "హిందూ దేశంగా" మార్చేందుకు ప్రయత్నిస్తోంది' అని ఒవైసీ ఆ సభలో ఆరోపించారు. ముమ్మారు తలాక్ చట్టంపైనా విమర్శలు గుప్పించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న యూపీలో ఎంఐఎం 100 స్థానాల్లో పోటీ చేస్తుందని ఒవైసీ ప్రకటించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details