Ajay Mishra Fires On Media: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్ర మరో వివాదంలో చిక్కుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరిలో రైతులపై చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో ఆయన కుమారుడు ఆశిష్ మిశ్ర అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ ఘటన ప్రణాళికతో చేసిన కుట్రే అని సిట్ నిన్న వెల్లడించింది. దీనిపై ఆయన్ను ప్రశ్నించగా.. విలేకరులపై చిందులు తొక్కారు. దుర్భాషలాడుతూ వారిని నెట్టేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర బుధవారం లఖింపుర్ జిల్లాకు వెళ్లారు. అక్కడ ఓ ఆస్పత్రిని సందర్శించి బయటకు వస్తుండగా విలేకరులు ఆయన్ను చుట్టుముట్టారు. లఖింపుర్ ఖేరి ఘటనపై సిట్ నివేదిక గురించి, ఈ ఘటనలో ఆశిష్ మిశ్రాపై నమోదైన హత్యాయత్నం అభియోగాల గురించి ప్రశ్నించారు. విలేకరుల ప్రశ్నలతో సహనం కోల్పోయిన అజయ్ మిశ్రా.. వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
"మీ మెదడు పనిచేయట్లేదా? ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడగకండి. వీళ్లకు సిగ్గులేదు" అంటూ దుర్భాషలాడారు. మైక్ ఆఫ్ చేయు అంటూ ఓ విలేకరిని తోసేశారు. తన కుమారుడు అమాయకుడని, కుట్రపూరితంగా అతడిని ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. అనంతరం అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.