TS HC on Group 1 Prelims Exam : రాష్ట్రంలో జూన్ 11న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలను వాయిదా వేయాలంటూ 36 మంది అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ పుల్లా కార్తీక్ ఈ పిటిషన్‌లపై నేడు విచారణ జరపగా.. వివిధ పరీక్షల మధ్య వ్యవధి నిబంధన పాటించట్లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న హైకోర్టు.. వివరణ ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శికి నోటీసులు ఇచ్చింది. కౌంటర్లు వేయాలని హోంశాఖ కార్యదర్శి, సిట్‌ను ఆదేశించింది. ఈ మేరకు స్టేకు నిరాకరిస్తూ.. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
నా బిడ్డా పరీక్ష రాస్తుంది..: అంతకుముందు ఇదే పిటిషన్‌పై వెకేషన్ కోర్టులో విచారణ జరిగింది. విచారణ జరిపిన జస్టిస్ కె.లక్ష్మణ్.. తన కుమార్తె కూడా గ్రూప్-1 పరీక్ష రాస్తున్నందున పిటిషన్‌ను విచారించలేనని తెలిపారు. మధ్యాహ్నం మరో బెంచ్‌కు పంపిస్తానని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం విచారణ జరిపిన జస్టిస్ పుల్లా కార్తీక్.. పరీక్షపై స్టే ఇచ్చేందుకు నిరాకరించారు.
గత సంవత్సరం అక్టోబర్ నెలలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను నిర్వహించింది. ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులంతా మెయిన్స్ పరీక్షల కోసం సన్నద్ధమవుతుండగా.. మార్చి నెలలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో గ్రూప్-1 ప్రిలిమ్స్ సహా పలు పరీక్షలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసింది. మరికొన్ని పరీక్షలను వాయిదా వేసింది. తాజాగా గ్రూప్-1 పరీక్షను జూన్ 11న నిర్వహించేందుకు నిర్ణయించింది.