Tawang Tourism: భారత్, చైనా మధ్య పలుమార్లు ఘర్షణలు జరిగిన తవాంగ్ ప్రాంతం ప్రస్తుతం అరుణాచల్‌ప్రదేశ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా మారింది. గత ఆరేడు నెలలుగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. 1962 భారత్-చైనా యుద్ధం గుర్తులను ఇక్కడ మనం చూడవచ్చు. తవాంగ్ పట్టణానికి భారత్-చైనా సరిహద్దు సమీపంలోనే ఉన్నప్పటికీ దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యటకులు ఈ పట్టణానికి వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రంగా తవాంగ్‌ను భావించి ఇక్కడికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
యుద్ధభూమిలో పర్యటక శోభ.. 'తవాంగ్'కు తరలివస్తున్న టూరిస్ట్‌లు - తవాంగ్ టూరిజం
భారత, చైనా ఘర్షణలకు అనేక సార్లు వేదికైన తవాంగ్ ప్రాంతం.. అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతోంది. ఈ సరిహద్దు ప్రాంత అందాలను తిలకించేందుకు దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున పర్యటకులు తరలివస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఇక్కడ హోటళ్ల సంఖ్య పదిరెట్లకుపైగా పెరిగింది. పర్యాటక రంగంలో స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
తవాంగ్‌లో ఉండే హోటళ్లు రద్దీగా ఉంటున్నాయి. స్థానికులు పర్యాటకులకు తమ ఇళ్లలో కూడా ఆతిథ్యం ఇస్తున్నారు. పర్యాటక రంగంలోకి ప్రవేశించేందుకు తవాంగ్ వాసులు మొగ్గు చూపడంతో కొత్తగా అనేక ఉద్యోగ అవకాశాలు పుట్టుకొచ్చాయి. 2005-06లో తవాంగ్‌లో ఆరు నుంచి 7 హోటళ్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు వందకుపైగా హోటళ్లు తవాంగ్‌లో ఉన్నాయి. అరుణాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం కూడా తవాంగ్‌లో పర్యాటక రంగానికి ఊతమిస్తోంది. పలు ప్రోత్సాహకాలను అందిస్తోంది.
తవాంగ్ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్‌గా వాదిస్తున్న చైనా అనేక సార్లు ఇక్కడ చొరబాట్లకు యత్నించింది. భారత సైన్యం చైనా యత్నాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. తవాంగ్‌లోని ప్రజలకు ఎలాంటి భద్రతా సమస్యలు లేకుండా భారత సైన్యం పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. క్షేత్రస్థాయిలో ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరుచుకుని వారికి ధైర్యంగా ఉంటోంది. భారత సైన్యం చేస్తున్న విశేష సేవలను స్థానికులు కొనియాడుతున్నారు.
మంచు వర్షం కురుస్తున్నా.. వాతావరణం కఠినంగా ఉన్నా.. భారత సైనికులు తమ రక్షణ కోసం విధులు నిర్వర్తిస్తూనే ఉంటారని అందుకే చైనా బలగాలు తవాంగ్ సెక్టార్‌లోకి చొచ్చుకు వచ్చేందుకు యత్నించినా.. సమర్థంగా అడ్డుకున్నారని స్థానికులు చెబుతున్నారు.