Tamilnadu teacher student love story: ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి.. 11వ తరగతి చదువుతున్న బాలుడిని తీసుకుని పారిపోయింది ఓ ఉపాధ్యాయురాలు. ఓ గుడిలో పెళ్లి చేసుకుని కాపురం పెట్టింది. చివరకు అరెస్టయింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.
తిరుచిరాపల్లి జిల్లా తురాయూర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న విద్యార్థి(17).. మార్చి 5న ఆడుకోవడానికి వెళ్లి కనిపించకుండా పోయాడు. దీనిపై పోలీసులకు అతడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రాథమిక విచారణను పాఠశాలలో ప్రారంభించారు. అదే స్కూల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న షర్మిల(26) కూడా కనిపించడం లేదని తెలుసుకున్నారు.
నిత్యం ఫోన్లో సంభాషణలు..పోలీసులు షర్మిల ఇంటికి వెళ్లి ఆమె తల్లిని విచారించారు. తన కూతురు ఫోన్లో ఓ విద్యార్థితో నిత్యం మాట్లాడుతుండేదని ఆమె వెల్లడించింది. పలుమార్లు వద్దని హెచ్చరించినా వినలేదని వివరించింది. షర్మిల ఫోన్ కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. వెళాంకిణి, తిరువారూర్, తంజావూర్, తిరుచిరాపల్లిలో ఆ ఫోన్ సిగ్నల్స్ గుర్తించారు.
మార్చి 25వ తేదీన సిగ్నల్ ఆధారంగా చూస్తే షర్మిల ఫోన్ తిరుచిరాపల్లి జిల్లాలోని ఎడమలపట్టి పుత్తూర్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హుటాహుటిన అక్కడకు వెళ్లారు. విద్యార్థితో కలిసి తన ఫ్రెండ్ ఇంట్లో ఆమె ఉంటున్నట్లు కనుగొన్నారు. షర్మిలను అదుపులోకి తీసుకుని, ప్రశ్నించారు. తంజావూరులోని ఓ ఆలయంలో మైనర్‌ను పెళ్లాడినట్లు ఆమె వెల్లడించింది. బాలుడిని అపహరించి, పెళ్లి చేసుకున్నందుకు ఆమెపై పోక్సో చట్టం కింద కేసు పెట్టి, పోలీసులు అరెస్టు చేశారు. ఆ విద్యార్థిని తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితురాలిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి, రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి: భర్తను చెట్టుకు కట్టేసి భార్యపై గ్యాంగ్ రేప్.. మహారాష్ట్రలో మైనర్లపై దారుణం..