Padakandla Srinivas: వాహనాల తుక్కే... అతడి చేతిలో పడితే మాత్రం అందమైన రూపం సంతరించుకుంటుంది! మూలన పడ్డ కారు.. ముచ్చటైన ప్రతిమగా మారుతుంది! పనికి రాని ప్లాస్టిక్ సైతం అచ్చెరువొందే శిల్పం అవుతుంది. ఇలాంటివి వందలకొద్దీ కళాఖండాలు సృష్టించారు పడకండ్ల శ్రీనివాస్. ఈ సృజనాత్మక ప్రతిభతో ప్రధాని మోదీనే మెప్పించారు. ‘మన్ కీ బాత్’లో అనుభవాలు పంచుకోవడానికి స్వయంగా ఆహ్వానం అందుకున్నారు. ‘నా ప్రయత్నమంతా పర్యావరణ హితానికే’ అంటున్న ఆ యువ ప్రొఫెసర్‌తో మాట కలిపింది ‘ఈతరం’.
Modi Mann Ki Batt: ప్రధాని మోదీ తన 75వ ‘మన్ కీ బాత్’లో శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘మనమంతా విజయవాడ ప్రొఫెసర్ శ్రీనివాస్‌లా వినూత్నంగా ఆలోచించాలి. ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ వ్యర్థాలకు తన నైపుణ్యాన్ని, కళాత్మకతను జోడించి.. చూడముచ్చటైన ప్రతిమలుగా మలుస్తున్న కళాకారుడాయన’ అని మెచ్చుకోవడంతో ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించారు.
ఫైన్‌ఆర్ట్స్‌తో మొదలు:శ్రీనివాస్‌ది ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు. ముందు నుంచీ ప్రతిదీ సృజనాత్మకంగా ఆలోచించేవారు. పెద్దయ్యాక ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్‌ఆర్ట్స్ (బీఎఫ్‌ఏ), బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ ఫైన్‌ఆర్ట్స్ (ఎంఎఫ్‌ఏ) పూర్తిచేశారు. తనకున్న ఆసక్తి, ప్రతిభతో ఏదైనా కొత్త ఆవిష్కరణ చేయాలని నిత్యం తపించేవారు. ఈ క్రమంలోనే ప్లాస్టిక్, ఆటోమొబైల్ వ్యర్థాలతో ఆకట్టుకునే ప్రతిమలు చేయాలనే ఆలోచన వచ్చింది. ఎందుకంటే.. దేశంలో ఏ మూలకు వెళ్లినా ఈ వ్యర్థాలు తేలికగా దొరుకుతాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, లారీల.. తుక్కు అన్ని ప్రాంతాల్లోనూ కుప్పలుగా పేరుకుపోయి ఉంటుంది. వీటితో అర్థవంతమైన ఆవిష్కరణ చేయడం అంటే.. తన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసుకోవడం, పర్యావరణహితం కూడా.
దేశవ్యాప్తంగా ముద్ర:2016లో విజయవాడలో ఓ వర్క్‌షాప్ ప్రారంభించారు శ్రీనివాస్. నగరపాలక సంస్థ కార్యాలయంతో పాటు పలు ప్రాంతాల్లో పేరుకుపోయిన మెటల్ వ్యర్థాలను సేకరించారు. దీనికి కార్పొరేషన్ సహకారంతో కష్టపడి శిల్పాలు తయారు చేశారు. వాటితో బస్టాండ్ సమీపంలో స్క్రాప్ పార్కు ఏర్పాటు చేశారు. ఎందుకూ పనికిరావు అనుకున్న సామగ్రితో తీరైన ఆకృతులు తయారవడం జనాన్ని ఆకర్షించింది. దాంతో సహజంగానే శ్రీనివాస్ పేరు మార్మోగిపోయింది. ‘మాకూ అలాంటి స్క్రాప్ పార్కులు ఏర్పాటు చేయ’మంటూ దేశంలోని ఇతర నగర పాలక సంస్థల నుంచి పిలుపు అందింది. వారి ఆహ్వానాన్ని అందుకున్న శ్రీనివాస్ స్థానిక ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా స్క్రాప్ కళాఖండాలు సృష్టిస్తున్నారు.