SIT Inquiry in TSPSC Paper Leakage Case : ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు సాంకేతికతను ఉపయోగించుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించినా పెద్దగా వివరాలు చెప్పకపోవడంతో.. సిట్ అధికారులు తమదైన శైలిలో ముందుకెళ్తున్నారు. నిందితులకు చెందిన బ్యాంకు ఖాతాలు, సెల్‌ఫోన్లు పూర్తిగా విశ్లేషించిన పోలీసులు వారి కుటుంబసభ్యులు, సన్నిహితుల బ్యాంకు ఖాతాలు పరిశీలిస్తున్నారు. కాల్ డేటా అధారంగా నిందితులు ఎవరెవరితో మాట్లాడారు? ఎక్కడెక్కడ కలిశారు? అనే వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.
TSPSC Paper Leak Case Update : ప్రధాన నిందితుడు ప్రవీణ్‌తో పాటు రాజశేఖర్ రెడ్డిని రెండుసార్లు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించినా సిట్‌కి ఆశించిన మేర సమాచారం రాలేదు. ఏఈ ప్రశ్నపత్రం లీక్ చేసిన డాక్యానాయక్, రాజేశ్వర్‌లు.. అధికారులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటవేయడంతో పలుమార్గాల్లో సమాచారం సేకరించారు. 19 మందిని అరెస్ట్ చేసిన సిట్.. మొత్తం రూ.38 లక్షల వరకు లావాదేవీలు జరిగినట్లు తేల్చారు. ఏఈ ప్రశ్నపత్రం దాదాపు 10 మందికి పైగా చేతులు మారినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు ఏఈ పరీక్ష రాసిన ఏడుగురిని గుర్తించారు. మిగతా వారిని గుర్తించే పనిలో సిట్ అధికారులున్నారు.
ప్రధాన నిందుతుడి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ: బ్యాంకు లావాదేవీల ఆధారంగా సిట్ అధికారులు నలుగురు నిందితులను ఇటీవల గుర్తించారు. ప్రవీణ్ బ్యాంకు ఖాతాలో నగదు జమ చేసిన ఖమ్మంకు చెందిన సాయి లౌకిక్, ఆయన భార్య సుష్మితలను అరెస్ట్ చేశారు. డీఏఓ ప్రశ్నపత్రం కోసం ప్రవీణ్ ఖాతాలో తన భార్య సుష్మిత సాయంతో సాయి లౌకిక్ నగదు బదిలీ చేసినట్లు గుర్తించారు. మహబూబ్‌నగర్‌కి చెందిన తండ్రి కుమారులు మైబయ్య, జనార్ధన్‌లను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. డాక్యానాయక్ బ్యాంకు ఖాతా పరిశీలించడంతో జనార్ధన్ నగదు జమ చేసినట్లు తేలింది.