తెలంగాణ

telangana

By

Published : Mar 6, 2021, 4:53 PM IST

ETV Bharat / bharat

మళ్లీ రాజకీయాల్లోకి చిన్నమ్మ- అన్నాడీఎంకేపైనే గురి!

అనూహ్యంగా ప్రజా జీవితం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన శశికళ.. మళ్లీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని చూస్తున్నారా? ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి చవిచూస్తే.. ఆ పార్టీని చేజిక్కిచ్చుకునేందుకు చిన్నమ్మ పావులు కదుపుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

Sasikala may reenter politics if AIADMK bites dust
మళ్లీ రాజకీయాల్లోకి చిన్నమ్మ- అన్నాడీఎంకేపై గురి!

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి, జయలలిత నెచ్చెలి శశికళ మళ్లీ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రజా జీవితం నుంచి వైదొలుగుతున్నట్లు ఇటీవలే హఠాత్తుగా ప్రకటించిన చిన్నమ్మ.. తమిళనాట మళ్లీ చక్రం తిప్పేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే విఫలమైతే.. మరోసారి రాజకీయాలపై దృష్టిసారించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండి:చిన్నమ్మ దారెటు? పార్టీపై పెత్తనం సాధ్యమా?

అన్నాడీఎంకేను తన హస్తగతం చేసుకోవడమో లేదంటే తన మేల్లుడు టీటీవీ దినకరన్ స్థాపించిన 'అమ్మ మక్కల్ మున్నేట్ర కట్చి'(ఏఎంఎంకే)ని అన్నాడీఎంకేను కలిపేయడమో జరుగుతుందని.. తద్వారా రాజకీయాల్లోకి శశికళ మళ్లీ ఎంట్రీ ఇస్తారని తమిళనాడు వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

నిజానికి అన్నాడీఎంకే పార్టీలోకే రావాలని శశికళ తొలుత భావించారు. కానీ అందుకు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్​ సెల్వంల నుంచి విముఖత వ్యక్తమైంది. ఈ విషయమై భాజపా సన్నిహితుడు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎస్​ గురుమూర్తి ఇరువురితో చర్చలు సైతం జరిపారు. అయితే, పార్టీలోకి చేర్చుకునే విషయంపై వారు అభిప్రాయం మార్చుకోలేదు.

ఇదీ చదవండి:'శశికళను అన్నాడీఎంకేలోకి చేర్చుకునే ప్రసక్తే లేదు'

భాజపా ఒత్తిడితోనే?

ఈ విషయంపై భాజపా శిబిరం అసంతృప్తితో ఉన్నట్లు ఊహాగానాలు వినిపించాయి. టీటీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే పార్టీ.. వేరుగా ఎన్నికల బరిలో దిగితే అన్నాడీఎంకే ఓట్లను చీల్చుతుందని, అది ప్రత్యర్థికి లాభిస్తుందని కాషాయ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే హోరాహోరీగా ఉన్న పోటీలో ఇది ప్రతికూలాంశం అవుతుందని భావిస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని భాజపా జాతీయ నాయకత్వమే.. రాజకీయాల్లోంచి వైదొలగాలని శశికళపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఇందుకోసం అధిష్ఠానం పక్కా వ్యూహాన్ని రచించిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి:చిన్నమ్మ విడుదలతో తమిళ రాజకీయాల్లో మార్పులు?

మరోవైపు.. శశికళ మళ్లీ రాజకీయాల్లోకి రానున్నట్లు వస్తున్న వార్తలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయంపై శశికళ భర్త దివంగత నటరాజన్ మేనల్లుడు ఏ రాజా పరోక్ష సూచనలు ఇవ్వడం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చుతోంది.

"శశికళ చిన్నమ్మ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అప్పటి వరకు మా కుటుంబం నిశబ్దంగానే ఉంటుంది. సొంత అహంకారంతోనే అన్నాడీఎంకే పతనమవుతుంది. అప్పుడు చిన్నమ్మను ఏ శక్తి ఆపలేదు. అన్నాడీఎంకేకు, తమిళనాడు ప్రజలకు శశికళ లాంటి వ్యక్తి అవసరం."

-ఏ రాజా, శశికళ బంధువు

ఎన్నికల్లో అన్నాడీఎంకే పరాజయం పాలవుతుందని శశికళ కుటుంబసభ్యులు భావిస్తున్నారు. ఆ తర్వాత కార్యక్షేత్రంలోకి దిగి పార్టీని చేజిక్కించుకోవాలని అనుకుంటున్నారు. అలా చేస్తే భాజపా నుంచీ వ్యతిరేకత ఉండదని అంచనా వేస్తున్నారు.

శశికళ రాజకీయాలకు దూరంగా ఉండే అవకాశం లేదని భాజపా సైతం భావిస్తోంది. తన తర్వాతి వ్యూహాన్ని దాచి ఉంచేందుకే ప్రస్తుతం మౌనం వహిస్తున్నారని చెబుతోంది.

ఇలా శశికళ రాజకీయ అరంగేట్రంపై స్పష్టమైన సూచనలు కనిపిస్తున్నాయి. మరి చిన్నమ్మ తర్వాతి అడుగు ఎటు వైపు? ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె నుంచి ప్రకటన వస్తుందా?.. అన్న విషయాలపై వేచి చూడాల్సి ఉంది.

ఇదీ చదవండి:శశికళ గుడ్​బై​: లాభం ఎవరికి? నష్టపోయేదెవరు?

ABOUT THE AUTHOR

...view details