ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకున్న తరహాలోనే రేషన్ బియ్యం, గోధుమలనూ పొందేలా ఆటోమేటిక్ గ్రెయిన్ డిస్సెన్సింగ్ మిషన్లను కేంద్రం అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం దేశంలోని 5 నగరాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద వీటిపై ప్రయోగం చేస్తున్నట్లు కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండే తెలిపారు.
ప్రయోగాత్మకంగా..
గుజరాత్‌లో అమలవుతున్న జాతీయ ఆహారభద్రత పథకం సమీక్ష సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు పాండే. ప్రజలు చౌకధరల దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ మిషన్ల ద్వారా సరకు తీసుకొనే వ్యవస్థను తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి మిషన్‌ను ప్రయోగాత్మకంగా అహ్మదాబాద్ నగరంలో ఏర్పాటు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారాయన. అలాగే రేషన్ బియ్యం, గోధుమలను స్థానిక అవసరాలకు అనుగుణంగా ఆ రాష్ట్రంలోనే సేకరిస్తే రవాణా ఖర్చు తగ్గుతుందన్నారు. బియ్యం, గోధుమ నిల్వల కోసం గోదాములు కాకుండా ఉక్కు గాదెలు (స్టీల్‌సైలోస్) నిర్మించాలని సూచించారు.
ప్రస్తుతం ఉన్న సరకు నిల్వ వ్యవస్థను ఆధునికీకరించడంలో భాగంగా 100 లక్షల మెట్రిక్‌టన్నుల గోధుమలు నిల్వచేసేలా ఉక్కు గాదెలు నిర్మించబోతున్నట్లు పాండే చెప్పారు. కాలం చెల్లిన గోదాముల స్థానంలో ఉక్కు గాదెల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:డ్రగ్స్ కేసు చుట్టూ బంగాల్ రాజకీయాలు!