తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నైట్​ వాచ్​మెన్ స్థాయి నుంచి ఐఐఎంలో ప్రొఫెసర్​గా..

కృషితో నాస్తి దుర్భిక్షం.. అన్న నానుడిని నిజం చేసి చూపారు కేరళకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్​ రంజిత్ రామచంద్రన్. నైట్ వాచ్​మెన్​ నుంచి ఐఐఎం రాంచిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పోస్టింగ్‌ను అందుకునేంత వరకూ.. ఆయన విజయ ప్రస్థానం ఎంతో మంది యువతకు స్ఫూర్తినిస్తోంది. తన విజయ గాథను చెబుతూ షేర్​ చేసిన వీడియో ఇప్పడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

Ranjith becomes an IIM Assistant Professor from meagre beginnings
నైట్​ వాచ్​మెన్ నుంచి ఐఐఎంలో ప్రొఫెసర్​ హోదాకు..

By

Published : Apr 13, 2021, 12:39 PM IST

Updated : Apr 13, 2021, 1:01 PM IST

నైట్​ వాచ్​మెన్ స్థాయి నుంచి ఐఐఎంలో ప్రొఫెసర్​గా..

అవసాన దశలో ఉన్న గోడలు.. గతుకుల నేల.. పైకప్పుగా మారిన టార్పాలిన్ షీట్.. ఆ ఆనవాళ్లను చూసే చెప్పొచ్చు. ఆ ఇంట్లో పేదరికం తాండవిస్తోందని. నాన్నది కుట్టుపని.. అమ్మ రోజూవారీ కూలీ.. తనమో నైట్ వాచ్‌మెన్. ఆ కుటుంబం పరిస్థితి ఇలా కొనసాగితే మనం చెప్పుకోవడానికి ఏముండేది కాదు. 'ఐఐఎం ప్రొఫెసర్ పుట్టింది ఇక్కడే' అంటూ ఆ కాపలాదారుడు షేర్ చేసుకున్న జీవిత పాఠాలు.. ఇప్పుడు నెట్టింట్లో స్ఫూర్తి మంత్రంగా మారాయి. కేరళలోని కాసరగోడ్ ప్రాంతంలోని పానతూర్‌కు చెందిన రంజిత్‌ రామచంద్రన్‌ పంచుకున్న ఆ విజయ ప్రస్థానాన్ని మనమూ చదివేద్దాం..!

''ఆర్థిక సమస్యలతో పాఠశాల విద్యను ఒడుదొడుకులతో సాగించాను. అమ్మనాన్నలకు చేదోడుగా ఉండేందుకు కాసర్‌గోడ్‌లో నైట్ వాచ్‌మెన్‌గా పనిచేశాను. ఉదయం పూట డిగ్రీ తరగతులకు హాజరై.. రాత్రి కాపాలాకాస్తుండేవాడిని. నా పని కొనసాగిస్తూనే.. డిగ్రీ పూర్తి చేసి, ఐఐటీ మద్రాస్‌లో ప్రవేశం పొందాను. ఇక్కడవరకు నాకు మాతృభాష మలయాళం మాత్రమే తెలుసు. భాష కారణంగా పీహెచ్‌డీ పూర్తి చేయకుండానే తిరిగి ఇంటికి వెళ్లిపోదామనుకున్నాను. కానీ, నా మార్గదర్శి డాక్టర్ సుభాష్ నాలో నింపిన స్ఫూర్తి పోరాడాలనే కసిని, నేర్చుకోవాలనే తపనను రేకెత్తించింది. ఆ పోరాట ఫలితమే గత సంవత్సరం నాకు దక్కిన డాక్టరేట్‌.''

-- రంజిత్​ రామచంద్రన్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

ప్రతి అడుగులోనూ కష్టం..

రంజిత్ పుట్టి పెరిగిన ఇల్లు
రంజిత్ సాధించిన అవార్డులు
సంతోషంలో రంజిత్ తల్లిదండ్రులు

పీహెచ్‌డీ పట్టా పొందిన తరవాత బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా అధ్యాపక వృత్తిలో కొనసాగారు. ఈ క్రమంలో గత వారం ఐఐఎం రాంచిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పోస్టింగ్‌ను అందుకున్నారు. అది ఆయన కల నెరవేరిన రోజు. వెంటనే తన విజయగాథను నలుగురితో పంచుకోవాలనుకున్నారు. ఈ స్థాయికి చేరడానికి ప్రతి అడుగులో తాను పడిన కష్టాన్ని, తనకు దక్కిన విజయాన్ని షేర్ చేశారు. అది ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. అన్ని వార్తా సంస్థల్లో ట్రెండింగ్‌ స్టోరీగా మారిపోయింది.

"ఆయన ఓడిపోయానని భావించిన క్షణం నుంచి తన జీవితాన్ని మలుపుతిప్పాడు. విజయాన్ని దక్కించుకున్నాడు. ఇది ప్రతి ఒక్కరికి ప్రేరణనిస్తుంది. విజయవంతులైన కేఆర్‌ నారాయణన్‌తో సహా గొప్ప వ్యక్తుల జీవిత కథలు మనముందు ఉన్నాయి. ఆయన అసాధారణ సంకల్ప శక్తితో రాష్ట్రపతి పదవిని చేపట్టారు. సమస్యలకు లొంగిపోవడానికి రంజిత్ లాంటి వ్యక్తులు నిరాకరిస్తారు. తమ వెనకబాటును అధిగమించడానికి విద్యను ఆయుధంగా ఉపయోగిస్తారు"

--- టీఎం థామస్ ఐజాక్, కేరళ ఆర్థికశాఖ మంత్రి

అందుకే షేర్​ చేశా..

వాచ్​మెన్​ టూ అసిస్టెంట్ ప్రొఫెసర్

రంజిత్‌ పోస్టుకు భారీ స్థాయిలో స్పందన లభిస్తున్న క్రమంలో ఆయన స్పందించారు. తన పోస్టు వైరల్‌గా మారుతుందని తానస్సలు అనుకోలేదన్నారు. తన కథ కొద్దిమందికైనా ఉపయోగపడుతుందని దాన్ని షేర్ చేశానని తెలిపారు. ప్రతి ఒక్కరు మంచి కలలు కనాలని.. వాటికోసం పోరాడాలని కోరుకుంటున్నట్లు రంజిత్ అన్నారు.

ఇదీ చదవండి :పెట్రో బాదుడుపై నిరసన- కేరళ​ టు నేపాల్​ సైక్లింగ్​

Last Updated : Apr 13, 2021, 1:01 PM IST

ABOUT THE AUTHOR

...view details