నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ సోమవారం ముగిసింది. దీంతో ఈడీ ప్రధాన కార్యాలయం నుంచి ఆయన బయటకు వచ్చారు. ఉదయం నుంచి దాదాపు 9 గంటలకు పైగా ఈడీ అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కేసులో విచారణకు మంగళవారం మరోసారి హాజరుకావాలని అధికారులు సమన్లు ఇచ్చినట్టు సమాచారం. సోమవారం విచారణలో కొన్ని ప్రశ్నలు కవర్ కాకపోవడంతో మంగళవారం మరోసారి విచారించనున్నట్టు తెలుస్తోంది.
భాజపా నేత సుబ్రహ్మణ్యస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు రాహుల్, సోనియాలకు సమన్లు పంపిన విషయం తెలిసిందే. అయితే, సోనియా అనారోగ్యం కారణంగా హాజరుకాకపోవడంతో సోమవారం రాహుల్ గాంధీ విచారణకు హాజరయ్యారు. దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం నుంచి తన సోదరి ప్రియాంకా గాంధీ, పార్టీ సీనియర్ నేతలతో కలిసి ప్రదర్శనగా ఆయన ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకోగా.. ఉదయం 11.30గంటలకు విచారణ మొదలైంది. ఈ సందర్భంగా రాహుల్‌ను పలు ప్రశ్నలు అడిగిన అధికారులు.. మనీలాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 50 ప్రకారం ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మధ్యాహ్నం 2.10గంటలకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత తిరిగి మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కొనసాగించారు. మంగళవారం రెండో రోజు విచారణ జరగనుంది.
మరోవైపు, రాహుల్‌ని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ దిల్లీ సహా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనబాట పట్టాయి. సోమవారం తెల్లవారు జాము నుంచే నిరసనలకు చేపట్టాయి. ఆయనకు సంఘీభావంగా పార్టీ నేతలు, కార్యకర్తలు వీధుల్లో నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. అయితే, దిల్లీలో ఆందోళనలకు అనుమతి లేదంటూ కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకొన్నారు. అదుపులోకి తీసుకొని సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఏఐసీసీ కార్యాలయం వద్ద ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, సీనియర్ నేతలను అరెస్టు చేసిన పోలీసులు మధ్యాహ్నం తర్వాత విడుదల చేశారు.