పంజాబ్‌లో ఉప ఎన్నిక జరిగిన సంగ్రూర్ ఫలితం ఆ రాష్ట్రంలోని సామాన్యులతో పాటు రాజకీయ పార్టీలు, దేశవ్యాప్తంగా ఉన్న విశ్లేషకులు, మేధావులను ఉలికిపాటుకు గురి చేసింది. దశాబ్దాల పాటు ఉగ్రవాదం, రక్తపాతంతో వణికిపోయిన పంజాబ్ కొంతకాలంగా ప్రశాంతంగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అద్భుత విజయం సాధించింది. ఆ పార్టీ తరఫున సంగ్రూర్ ఎంపీగా ఉన్న భగవంత్ మాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం వల్ల.. ఈ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో ఇక్కడ అనూహ్యంగా శిరోమణి అకాలీదళ్ (మాన్) అధ్యక్షుడు సిమ్రన్‌జిత్‌సింగ్ మాన్ విజయం సాధించారు. ఇది పంజాబ్‌లో మళ్లీ ప్రకంపనలకు కారణమవుతోంది.
ఎవరీ సిమ్రన్‌జిత్ సింగ్!:ఖలిస్థాన్ ఏర్పాటుకు సిమ్రన్‌జిత్ సింగ్ మాన్ గట్టి మద్దతుదారు. ఉగ్రవాద నేరాలతో శిక్షలు పడిన వారిని జైళ్ల నుంచి విడుదల చేయాలంటూ ప్రసంగాలు చేస్తుంటారు. సైనిక కుటుంబంలో 1945లో జన్మించిన సిమ్రన్‌జిత్ సింగ్ మాన్ ఉన్నత విద్యావంతుడు. ఆయన తండ్రి లెఫ్టినెంట్ కర్నల్ జోగిందర్ సింగ్ మాన్ గతంలో పంజాబ్ స్పీకర్‌గా పనిచేశారు. 1966లో ఐపీఎస్‌కు ఎంపికైన సిమ్రన్‌జిత్ మంచి అధికారిగానూ పేరు సంపాదించుకున్నారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు తోడల్లుడు కూడా. 1984లో స్వర్ణ దేవాలయంపై 'ఆపరేషన్ బ్లూస్టార్'ను నిరసిస్తూ ఐపీఎస్ పదవికి రాజీనామా చేశారు. నాటి నుంచి ప్రత్యేక ఖలిస్థాన్‌కు బహిరంగంగా మద్దతు పలుకుతున్నారు. నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యకు కుట్ర కేసులో ఆయన అయిదేళ్ల పాటు జైలుశిక్ష అనుభవించారు. ప్రకాశ్ సింగ్ బాదల్ కనుసన్నల్లో శిరోమణి అకాలీదళ్ మెతక వైఖరి అవలంబిస్తోందంటూ అకాలీదళ్ (మాన్) పార్టీని ఏర్పాటు చేశారు. 1989 లోక్‌సభ ఎన్నికల్లో ఈ పార్టీ పంజాబ్‌లో 6 ఎంపీ స్థానాలను గెలుచుకొని సంచలనం సృష్టించింది. సిమ్రన్‌జిత్ తరన్‌తరన్ నుంచి ఎంపీగా గెలుపొందారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత ప్రతి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా 1999లో ఆయన గెలుపొందడం మినహా ఆ పార్టీ తరపున ఎవరూ విజయం సాధించలేదు.
ప్రమాద సంకేతాలు..!:తొలి నుంచి పంజాబ్ రాజకీయాలను కాంగ్రెస్, అకాలీదళ్ (బాదల్) పార్టీలు శాసిస్తున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 4 స్థానాలు, 2017 శాసనసభ ఎన్నికల్లో 20 స్థానాలు సాధించి ఆప్ ప్రముఖ పార్టీగా ముందుకొచ్చింది. అప్పటికే జాతీయ, ప్రాంతీయ పార్టీలకు దూరంగా ఉన్న ప్రత్యేకవాదుల పరోక్ష మద్దతు ఆప్‌కు కలిసివచ్చిందనే ప్రచారం ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ కేవలం ఒక్క స్థానానికే పరిమితమవడం.. కాంగ్రెస్ 8 స్థానాలు గెలవడం వల్ల ఆప్ కథ ముగిసినట్లే భావించారు. అందుకు భిన్నంగా ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఆప్ ఏకంగా 92 స్థానాలు సాధించి పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. ప్రకాశ్ సింగ్ బాదల్ నేతృత్వంలోని అకాలీదళ్ 3 స్థానాలకే పరిమితమైంది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాలుగు నెలల్లోపే ఆప్ సైతం పట్టు కోల్పోతున్నట్లు సంగ్రూర్ ఉప ఎన్నిక సంకేతమిచ్చింది. పంజాబ్‌లో పదేళ్లుగా మాదకద్రవ్యాల వినియోగం జోరుగా సాగుతోంది.
జాతీయ సగటు (7.83%) కన్నా ఎక్కువగా నిరుద్యోగిత రేటు (9.2%) ఉంది. ప్రజల ఆలోచనల నుంచి తొలగిపోయిందనుకున్న ప్రత్యేకవాదం చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈమేరకు పంజాబీ గాయకులు ఆలపిస్తున్న గీతాలకూ ఆదరణ లభిస్తోంది. అయితే ప్రత్యేకవాదానికి మద్దతు తెలుపుతున్న వివిధ ముఠాల మధ్య పోరు సాగుతోంది. తుపాకీ సంస్కృతీ పెరుగుతోంది. ఈక్రమంలోనే గాయకుడు సిద్దూ మూసేవాలా గత నెలలో హత్యకు గురయ్యారు. ఈ హత్యతో పంజాబ్‌లోని సాయుధముఠాల మధ్య ఉన్న పోరు బయటపడింది. మూసేవాలా ఆఖరి పాటలో ఖలిస్థాన్ ఏర్పాటు, పంజాబ్-హరియాణాల మధ్య వివాదాస్పదంగా ఉన్న సట్లెజ్-యమున అనుసంధాన కాలువతో పాటు ప్రత్యేక ఖలిస్థాన్ జెండా ప్రదర్శన అంశాలున్నాయి. ఆ పాటను లక్షలాది మంది వీక్షించడం వల్ల కేంద్రం యూట్యూబ్‌లో బ్లాక్ చేయించింది. ఉప ఎన్నికలో మాన్ గెలిచిన అనంతరం సిక్కు రాజకీయాలను శాసించే శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ ప్రధాన కార్యదర్శి కర్నైల్‌సింగ్ పంజోలి "ఇది సిక్కు భావజాలానికి, పంత్ (గురువుల) సిద్ధాంతాలకు దక్కిన విజయం" అని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ రాతలన్నీ ప్రత్యేకవాదానికి మద్దతు పలికేవేనన్న ప్రచారం ఉంది.
ఇదీ చదవండి:'మహా' సంక్షోభంలో కీలక మలుపు.. గవర్నర్‌ను కలిసిన ఫడణవీస్