Punjab Honour killing: పంజాబ్‌లో పరువు హత్య కలకలం రేపింది. తార్న్ తారన్ సాహిబ్‌లో తన సొంత చెల్లిని అన్న హత్య చేశాడు. కుటుంబ సభ్యులకు ఇష్టం లేని వివాహం చేసుకుందని ఈ దారుణానికి పాల్పడ్డాడు. నిందితుడి కజిన్ అమర్.. మహిళ హత్యకు సహకరించాడు. మృతురాలిని 21ఏళ్ల స్నేహగా గుర్తించారు. ఆమె పట్టి పట్టణంలో నివసిస్తోందని పోలీసులు తెలిపారు. రాజన్ జోషి అనే వ్యక్తిని స్నేహ వివాహం చేసుకుందని.. అప్పటి నుంచి ఆమె తల్లిదండ్రులు కోపంగా ఉన్నారని పోలీసులు వివరించారు. ముఖ్యంగా స్నేహ సోదరుడు రోహిత్.. ఆమెపై విపరీతంగా కోపం పెంచుకున్నాడని తెలిపారు.
చాలా రోజుల నుంచే నవదంపతులను, వారి కుటుంబాన్ని రోహిత్ బెదిరిస్తున్నాడు. గతంలో స్నేహపై ఆమె తల్లి, సోదరి దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే శుక్రవారం.. స్నేహ సోదరులు, బంధువులు ఆమెను ఇంట్లో నుంచి బయటకు రావాలని పిలిచారు. రాత్రి 8 గంటల సమయంలో స్నేహ బయటకు వచ్చింది. ఆమెను హత్య చేసేందుకు అక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులు.. పదునైన కత్తులతో దాడికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావమైన స్నేహ.. ప్రాణాలు కోల్పోయింది.