PM Modi On Oppositions : బెంగళూరులో విపక్షాల సమావేశం జరుగుతున్న వేళ.. ప్రతిపక్షాల లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ ప్రజలు 2024లో కేంద్రంలో మళ్లీ బీజేపీ సర్కారును అధికారంలోకి తీసుకురావాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారని అన్నారు. అందుకే భారతదేశ దుస్థితికి కారణమైన వ్యక్తులు ఇప్పుడు తమ దుకాణాలను తెరిచారని విమర్శించారు. వారి దుకాణాల్లో కులతత్వ విషం, అపారమైన అవినీతి దొరుకుతుందంటూ.. ప్రతిపక్షాల సమావేశంపై ప్రధాని మోదీ మండిపడ్డారు. పోర్ట్ బ్లెయిర్‌లోని వీర్ సావర్కర్ విమానాశ్రయం కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రధాని మోదీ మంగళవారం దిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.
"ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు చెందిన, ప్రజల కొరకు, ప్రజల చేత అని అర్థం. కానీ వంశపారంపర్య రాజకీయ పార్టీలకు ఈ నిర్వచనం వేరేలా ఉంటుంది. కుటుంబం కోసం అన్నట్లు వ్యవహరిస్తారు. కుటుంబమే వారి మొదటి ప్రాధాన్యం. దేశం గురించి పట్టించుకోరు. ఇది వారి నినాదం. ద్వేషం, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు చేస్తారు. వంశపారంపర్య రాజకీయాలకు కొన్నాళ్ల క్రితం వరకు దేశం బలైపోయింది. ప్రతిపక్షాలకు దేశంలోని పేదలు ముఖ్యం కాదు.. వారి కుటుంబ ఎదుగుదల మాత్రమే ముఖ్యం."
-నరేంద్ర మోదీ, భారత ప్రధాని
Opposition Meeting In Bangalore :విపక్ష కూటమి సమావేశాలను అవినీతి నేతల సమూహంగా అభివర్ణించారు మోదీ. "భారత్‌ను దుస్థితిలోకి నెట్టిన నాయకులు.. తమ దుకాణాలు తెరిచి కూర్చుకున్నారు. వారంతా ఇప్పుడు బెంగళూరులో సమావేశమయ్యారు. వారంతా కెమెరాలో ఒక ఫ్రేమ్‌లోకి వచ్చినప్పుడు, ఆ ఫ్రేమ్‌ను చూసిన ప్రజలు లక్షలాది రూపాయల అవినీతి వ్యవహారాలే గుర్తుకు వస్తున్నాయని చెబుతున్నారు. కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడి ఎవరైనా బెయిల్‌పై బయటకు వస్తే ఈ సభ వారిని ప్రత్యేకంగా చూస్తుంది. కుటుంబం మొత్తం బెయిల్‌పై బయట ఉంటే వారికి మరింత గౌరవం ఇస్తుంది" అని మోదీ అన్నారు.