తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అఫ్గాన్​ పరిస్థితులపై కేంద్రం చర్చ- మోదీ కీలక ఆదేశాలు!

అఫ్గానిస్థాన్​లో ప్రస్తుత పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వ అత్యున్నత స్థాయి బృందం సమావేశమైంది. విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ సహా సీనియర్ అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. తక్షణ ప్రాధాన్యాలపై దృష్టిసారించాలని వీరికి ప్రధాని మోదీ సూచించినట్లు తెలుస్తోంది.

By

Published : Aug 31, 2021, 3:02 PM IST

Updated : Aug 31, 2021, 3:12 PM IST

modi afghan
మోదీ అఫ్గాన్ చర్చ

అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా పూర్తిగా వైదొలిగిన వేళ అక్కడి పరిణామాల(afghanistan present condition)పై చర్చించేందుకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, ఇతర సీనియర్ అధికారులతో కూడిన అత్యున్నత స్థాయి బృందం సమావేశమైంది. భారత్​కు తక్షణ ప్రాధాన్యమైన అంశాలను గుర్తించి, వాటిపై దృష్టిసారించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(modi on afghanistan) ఈ బృందానికి ఆదేశించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మోదీ మార్గనిర్దేశనంలో ఈ బృందం.. కొద్దిరోజులుగా తరచూ భేటీ అవుతోందని తెలిపాయి.

"అఫ్గాన్​లో చిక్కుకుపోయిన భారతీయులను, అఫ్గానిస్థాన్ మైనారిటీలను భారత్​కు తీసుకొచ్చే అంశంపై దృష్టిసారించాలని ఈ బృందానికి మోదీ ఆదేశించారు. అఫ్గాన్ భూభాగాన్ని భారత వ్యతిరేక ఉగ్రవాదులు ఉపయోగించుకోకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం అఫ్గాన్​లో పరిస్థితుతులు, అంతర్జాతీయంగా వ్యక్తమవుతున్న అభిప్రాయాలు, ఐరాస భద్రతా మండలిలో ఆమోదించిన తీర్మానాన్ని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు."

-అధికార వర్గాలు

మరోవైపు, అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా పూర్తిగా వైదొలిగింది. ఆగస్టు 31 గడువును దృష్టిలో ఉంచుకొని తన సైన్యాన్ని పూర్తిగా ఆ దేశం నుంచి తరలించేసింది. దీంతో రెండు దశాబ్దాల యుద్ధానికి తెరపడటమే కాకుండా... అఫ్గాన్ సంపుర్ణంగా తాలిబన్ల చేతుల్లోకి వచ్చినట్లైంది.

అమెరికా చివరి విమానం బయల్దేరగానే కాబుల్​లోని హమిద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాలిబన్లు తమ అధీనంలోకి తీసుకున్నారు. బలగాల ఉపసంహరణ పూర్తికాగానే కాబుల్ వ్యాప్తంగా తాలిబన్లు, మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. అఫ్గాన్​లో ప్రభుత్వ ఏర్పాటు అంశంపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు. అయితే, ఓ కౌన్సిల్ ద్వారా పాలన ఉంటుందని తాలిబన్లు సూచనప్రాయంగా చెప్పారు. షరియా చట్టం ప్రకారమే ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

వేచి చూసే ధోరణిలో భారత్

అఫ్గాన్​ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన భారత్.. అక్కడి పరిస్థితులపై వేచి చూసే ధోరణి పాటిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు పూర్తయ్యే వరకు వేచి చూస్తోంది. అఫ్గాన్ అంశంపై ఇతర దేశాలతో సంప్రదింపులు చేస్తోంది. గల్ఫ్ దేశాలతోనూ తరచుగా చర్చలు జరుపుతోంది.

ఇదీ చదవండి:అఫ్గాన్​ భవితవ్యాన్ని తేల్చేది ఈ 10 ప్రశ్నలే!

Last Updated : Aug 31, 2021, 3:12 PM IST

ABOUT THE AUTHOR

...view details