పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని అరాచకాలు జరుగుతున్నాయని.. ఇలా చేస్తే తర్వాత తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ను త్వరలోనే తిరిగి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. శ్రీనగర్‌లో నిర్వహించిన 'శౌర్య దివస్' కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. జంట కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్ము కశ్మీర్, లద్దాఖ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు. తమ అభివృద్ధి ప్రస్థానాన్ని జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లో ఇప్పుడే ప్రారంభించామని.. తమ లక్ష్యమైన గిల్గిట్, బాల్టిస్థాన్‌కు త్వరలోనే చేరుకుంటామని పేర్కొన్నారు.
మానవ హక్కుల పేరిట పాకిస్థాన్ మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు రాజ్‌నాథ్ సింగ్. పీఓకే ప్రజల బాధలు వారినే కాకుండా తమను కూడా బాధిస్తాయన్నారు. ఉగ్రవాదానికి మతం లేదని.. భారత్‌పై గురిపెట్టడమే వారి లక్ష్యమని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆర్టికల్ 370ని రద్దు చేశామని.. దీని వల్ల జమ్ము కశ్మీర్ ప్రజలపై జరుగుతున్న వివక్ష అంతమైందన్నారు. శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ చేపట్టిన 'జమ్ము కశ్మీర్ ఏకతా యజ్ఞం' 2019 ఆగస్ట్ 5న పూర్తైందని పేర్కొన్నారు.