తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జనతా కర్ఫ్యూకు ఏడాది- మళ్లీ అదే పరిస్థితా?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో యావద్దేశం పాటించిన 'జనతా కర్ఫ్యూ'కు నేటితో ఏడాది పూర్తవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో ఎన్నో మార్పులు. లాక్​డౌన్, అన్​లాక్​లను దాటుకొని 'వ్యాక్సినేషన్​' దశలోకి దేశం అడుగుపెట్టింది. మరి కరోనా విషయంలో ఇప్పుడు భారత్ పరిస్థితి ఏంటి?

By

Published : Mar 22, 2021, 2:14 PM IST

one year for janata curfew
జనతా కర్ఫ్యూకు ఏడాది- మళ్లీ అదే పరిస్థితా?

2020 జనవరి 27.. భారత్​లో తొలి కరోనా కేసు! అప్పటికి విదేశాల్లో కొవిడ్ వ్యాప్తి గురించి సమాచారమే తప్ప మహమ్మారి గురించి ఇక్కడి ప్రజలకు ప్రత్యక్ష అనుభవం లేదు. అప్పటి నుంచి రోజూ అడపాదడపా కేసులు వెలుగులోకి రావడం దేశ ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. మార్చి 10 నాటికి 50, మార్చి 15 నాటికి 100... ఇలా కరోనా వ్యాప్తి యావద్దేశాన్ని భయాందోళనకు గురిచేసింది.

అప్పుడు వచ్చింది దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ఓ ప్రకటన. మార్చి 22న దేశ ప్రజలంతా జనతా కర్ఫ్యూ పాటించాలని. కరోనా పోరులో తోటివారికి సంఘీభావంగా, వైరస్‌ విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశ ప్రజలు సంకల్పంతో ముందుకు రావాలని మోదీ పిలుపునిచ్చారు. మార్చి 22న(ఆదివారం) ప్రజలందరూ స్వయం ప్రకటిత కర్ఫ్యూలో పాల్గొనాలని కోరారు. ప్రధాని పిలుపుతో దేశ ప్రజలంతా ఏకమయ్యారు. సంకల్ప బలంతో 14 గంటల పాటు ఇంట్లోనే ఉండి జనతా కర్ఫ్యూను విజయవంతం చేశారు. ఈ సందర్భానికి నేటితో ఏడాది పూర్తవుతోంది. మరి ఇప్పుడు దేశ పరిస్థితి ఎలా ఉంది? ఈ ఏడాది కాలంలో వచ్చిన మార్పులేమైనా ఉన్నాయా? దేశంలో మళ్లీ లాక్​డౌన్ విధిస్తారా? అనే విషయాలను ఓ సారి పరిశీలిస్తే..

జనం కోసం, జనం చేత, జనంపైనే విధించే కర్ఫ్యూనే జనతా కర్ఫ్యూ
ఉత్తర్​ప్రదేశ్​లో వెలవెలబోయిన ఓ రైల్వేస్టేషన్​
రాయ్​చూర్​ బస్​ స్టాండ్​లో ఓ వృద్ధుడు

ఎత్తు పల్లాలన్నీ చూశాం

జనతా కర్ఫ్యూ పాటించినప్పటి నుంచి ఇప్పటి వరకు కరోనా మహమ్మారి విషయంలో దేశం ఎత్తుపల్లాలన్నింటినీ చూసింది. రోజువారీ కరోనా వైరస్ కేసులు పదులు, వందల నుంచి వేల స్థాయికి చేరుకున్నాయి. ఒకానొక దశలో 90 వేల చొప్పున కేసులు నమోదయ్యాయి. కానీ ఆ తర్వాత క్రమంగా కరోనా అదుపులోకి వచ్చింది. సగటున 10 వేల స్థాయికి రోజువారీ కేసులు పడిపోయాయి. కనిష్ఠంగా 8,635 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు, కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. దశలవారీగా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. విజయవంతంగా పంపిణీ కొనసాగుతోంది.

జనతా కర్ఫ్యూ రోజు.. బంగాల్​లో మహారాష్ట్ర నుంచి వచ్చిన ప్రయాణికుల తిప్పలు
నోయిడాలోని ఓ అపార్ట్​మెంట్ ప్రజల చప్పట్లు

అంతా సవ్యంగానే ఉందని అనుకుంటున్న ఈ సమయంలోనే పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగింది. వైరస్ అదుపులోకి వచ్చిందన్న అపోహతో కనీస జాగ్రత్తలు గాలిలో కలిసిపోయాయి. ఈ పర్యవసనాలు రోజువారి కేసుల్లో స్పష్టంగా కనిపించింది. గత కొన్ని రోజుల నుంచి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మార్చి 18 నుంచి నాలుగు రోజుల పాటు వరుసగా 35వేలు, 40 వేలు, 41 వేలు, 43 వేల కొవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. మార్చి 22న 46,951 కేసులు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ వ్యాప్తి మొదలైందనే విషయాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

మళ్లీ అక్కడికే వచ్చామా?

గుర్తుందా...? జనతా కర్ఫ్యూ తర్వాతి రోజే దేశవ్యాప్తంగా లాక్​డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఇది మూడు సార్లు పొడిగించారు. మే 31 వరకు చివరి దశ కొనసాగింది. జూన్ 1 నుంచి దేశం అన్​లాక్ ఫేజ్​లోకి అడుగుపెట్టింది.

చప్పట్లు కొట్టి, గంటలు మోగించి కేంద్ర మంత్రుల సంఘీభావం
మహారాష్ట్రలో జనతా కర్ఫ్యూ రోజున ఇలా..

ఇప్పుడు కేసుల పెరుగుదలతో పలు రాష్ట్రాలు మళ్లీ ఆంక్షల బాట పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించాయి. ప్రజలు బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. కరోనా ఉద్ధృతి మళ్లీ ప్రారంభమైందన్న ఆందోళనలు దేశప్రజల్లో మళ్లీ మొదలయ్యాయి. మొత్తానికి జనతా కర్ఫ్యూ నాటి రోజులను తలపించేలా దేశ పరిస్థితి ఉందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. లాక్​డౌన్ భయాలు అలుముకున్నాయి. కొవిడ్ కేసుల పెరుగుదల కొనసాగితే మరోసారి దేశవ్యాప్త లాక్​డౌన్ ఉంటుందేమోనన్న చర్చలు ఊపందుకున్నాయి.

జనతా కర్ఫ్యూతో కోల్​కతాలో బోసిపోయిన రహదారి
బెంగళూరు మెజెస్టిక్ బస్టాండ్ వెలవెల

ఇవీ చదవండి:

ఏం జరుగుతుంది?

దేశవ్యాప్త లాక్​డౌన్ విధించే అవకాశం ఏ మాత్రం లేదన్నది నిపుణుల మాట. జనతా కర్ఫ్యూ నాటి రోజులతో పోలిస్తే.. కరోనా కట్టడిలో దేశం అనేక విషయాలను నేర్చుకుంది. వైరస్​పై ప్రజలకు అవగాహన పెరిగింది. కనీస జాగ్రత్తలతో వైరస్​ను జయించవచ్చని తెలిసొచ్చింది.

గంట కొడుతున్న యూపీ సీఎం యోగి
చప్పట్లతో సచిన్ సంఘీభావం

ఇదీ చూడండి: జనతా కర్ఫ్యూలో రాజకీయ ప్రముఖులు- చప్పట్లతో సంఘీభావం

దేశంలో వైద్య వసతులు మెరుగయ్యాయి. కొవిడ్ మొదలైన తొలి రోజుల్లో వైరస్​ను గుర్తించేందుకు ఒకే ఒక్క ల్యాబ్ అందుబాటులో ఉండేది. ఇప్పుడు వైరస్ నిర్ధరణ ల్యాబ్​ల సంఖ్య వేలల్లో ఉంది. పీపీఈ కిట్లు, వెంటిలేటర్ల కోసం విదేశాలపై ఆధారపడే పరిస్థితి మారిపోయింది. ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఉత్పత్తి పెరిగింది. వీటన్నింటికీ మించి కరోనాకు బ్రహ్మాస్త్రంగా భావిస్తున్న 'టీకా' అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే అనేక దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. భారత్​లో ఇప్పటివరకు 4 కోట్ల 50 లక్షలకుపైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి. మరిన్ని టీకాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. కాబట్టి.. కరోనా కట్టడి విషయంలో దేశం ఎంతో మెరుగైందన్న విషయం స్పష్టమవుతోంది.

ఇదీ చదవండి:

జనతా కర్ఫ్యూ: దక్షిణాన ఎక్కడివారక్కడే గప్​చుప్​

'జనతా కర్ఫ్యూ'తో ఉత్తర భారతం ఇలా...

ప్రభుత్వాల సమన్వయం

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ కొవిడ్ కట్టడికి వ్యూహరచన చేస్తోంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిర్ణయాత్మక చర్యలతోనే కొవిడ్​ను కట్టడి చేయవచ్చని ప్రధాని స్పష్టం చేశారు. కరోనాపై పోరాటంలో సాధించిన విశ్వాసం నిర్లక్ష్యానికి దారి తీయరాదని రాష్ట్రాలకు సూచించారు.

జాగ్రత్తలు పాటిస్తే సరి!

ఈ పరిస్థితుల్లో కరోనాను నియంత్రించేందుకు లాక్​డౌన్ ఒక్కటే మార్గం కాదని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించడం, భౌతిక దూరం వంటి కనీస జాగ్రత్తలతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే కొవిడ్​ను జయించవచ్చని నిపుణులు సైతం చెబుతున్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

దేశంలో ఇప్పటివరకు 1,15,99,130 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 11,130,288 మంది రికవరీ అయ్యారు. 3.09 లక్షల యాక్టివ్ కేసులు ఉండగా.. 1,59,755 మరణాలు సంభవించాయి.

ABOUT THE AUTHOR

...view details