నీట్ ప్రవేశ పరీక్షలో(NEET 2021) ప్రశ్నాపత్రాలు తారుమారైన ఇద్దరు విద్యార్థులకు మళ్లీ పరీక్ష పెట్టాలని ఆదేశించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం పక్కనబెట్టింది.
ఈ ఏడాది సెప్టెంబరు 12న నీట్ ప్రవేశ పరీక్ష జరిగింది. అయితే మహారాష్ట్రలో ఈ పరీక్షకు హాజరైన ఇద్దరు అభ్యర్థుల టెస్టు బుక్‌లెట్, ఓఎంఆర్ షీట్లు ఇన్విజిలేటర్ల నిర్లక్ష్యం కారణంగా పరీక్షా కేంద్రంలో తారుమారయ్యాయి. దీంతో వీరు బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. ఆ ఇద్దరు విద్యార్థులకు మళ్లీ పరీక్ష(NEET 2021) నిర్వహించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇప్పుడు వీరికి రీ-ఎగ్జామినేషన్‌కు (NEET 2021 exam) అనుమతినిస్తే మిగతా విద్యార్థులు కూడా చిన్న చిన్న తప్పులకే మళ్లీ పరీక్ష పెట్టమని కోరుతారని కేంద్రం తెలిపింది. అందువల్ల బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరింది.
ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపింది. ప్రశ్నాపత్రాలు తారుమారవడం వల్ల తాము విలువైన సమయాన్ని కోల్పోయామన్న విద్యార్థుల వాదనను కోర్టు అంగీకరించింది. విద్యార్థులకు ఎదురైన పరిస్థితికి తాము విచారపడుతున్నామని, అయితే వారికి మళ్లీ పరీక్ష(NEET 2021 exam) పెట్టాలని ఆదేశించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆ ఇద్దరు విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించడమనేది కష్టతరమైన ప్రక్రియ అని, అందువల్ల బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కనబెడుతున్నట్లు వెల్లడించింది.