Interpol conference 2022 : ఉగ్రవాదులు, అవినీతిపరులు, నేరస్థులకు అనుకూలమైన అన్ని మార్గాలను పూర్తిగా మూసివేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అందుకోసం అంతర్జాతీయ సమాజం మరింత వేగవంతంగా, కలిసి కట్టుగా పని చేయాలని మోదీ పిలుపునిచ్చారు. దిల్లీలో ఇంటర్‌పోల్ 90వ జనరల్ సమావేశాలను ప్రారంభించిన ఆయన.. దుష్ట శక్తుల ఆట కట్టించాలంటే మంచి శక్తులు కలిసి పని చేయాలని వివరించారు.
ఉగ్రవాదం, డ్రగ్స్, స్మగ్లింగ్, వ్యవస్థీకృత నేరాలు మానవాలిని పీడిస్తున్న ప్రధాన సమస్యలని మోదీ అన్నారు. అవి ఏ ఒక్క దేశానికో పరిమితం కాలేదనీ వాటికి అన్ని దేశాల్లో గట్టి పునాదులు కలిగి ఉన్నాయన్నారు. ఆ నెట్వర్క్‌ను ఎదుర్కోడానికి లోకల్‌గా తీసుకునే చర్యలు ఏమాత్రం సరిపోవని తెలిపారు. ఉగ్రవాదం లాంటి పెనుభూతాన్ని భూస్థాపితం చేయాలంటే దేశాలన్నీ ఏకతాటి పైకి రావాలని వివరించారు. ఇంటర్‌పోల్ 90వ అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకునే మోదీ వంద రూపాయల నాణేన్ని విడుదల చేశారు.