తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వలస పక్షులతోనే బర్డ్ ​ఫ్లూ- అప్రమత్తంగా కేంద్రం'

దేశవ్యాప్తంగా బర్డ్​ ఫ్లూతో 4 రాష్ట్రాల పరిధిలో వేలాదిగా పక్షులు మృత్యువాత పడుతున్నాయి. రాజస్థాన్​, మధ్యప్రదేశ్​లో కాకులు.. హిమాచల్​ ప్రదేశ్​, కేరళల్లో బాతులు ఎక్కువగా మరణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి.. వైరస్​ వ్యాప్తి కట్టడిలో రాష్ట్రాలకు సహకరిస్తోంది. వలస పక్షులే బర్డ్​ ఫ్లూకు ప్రధాన కారణమని తెలిపారు కేంద్ర పాడి, పశు సంవర్థక శాఖ మంత్రి గిరిరాజ్​ సింగ్​. కేంద్రం అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు.

By

Published : Jan 6, 2021, 5:37 PM IST

Government confirms bird flu cases in Rajastha
'వలసపక్షులతోనే బర్డ్​ఫ్లూ- అప్రమత్తంగా ఉన్నాం'

దేశంలో 4 రాష్ట్రాల్లో బర్డ్ ​ఫ్లూ(ఏవియన్​ ఇన్​ఫ్ల్యుయెంజా) కలకలం సృష్టిస్తోంది. రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, హిమాచల్​ ప్రదేశ్​, కేరళల్లో వేలాదిగా పక్షులు మృత్యువాత పడుతున్నట్లు కేంద్ర పాడి, పశు సంవర్థక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆయా రాష్ట్రాల నుంచి సేకరించిన నమూనాలను భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్​)- నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ హై సెక్యూరిటీ యానీమల్​ డిసీజెస్​ పరీక్షించిన తర్వాత పలు విషయాలు వెల్లడించింది.

వలస పక్షులే కారణం: కేంద్ర మంత్రి

వలస పక్షులే దేశంలో బర్డ్​ ఫ్లూ విజృంభణకు ప్రధాన కారణమని తెలిపారు కేంద్ర పాడి, పశు సంవర్థక శాఖ మంత్రి గిరిరాజ్​ సింగ్​. కేరళలో అత్యధికంగా 25 వేల బాతులు చనిపోయాయని ఆయన వెల్లడించారు. కేంద్రం అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాల్లో ఈ వ్యాధి సంక్రమణకు అడ్డుకట్ట వేసే దిశగా పలు చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.

''బర్డ్ ​ఫ్లూ కేసులు ప్రపంచవ్యాప్తంగా వెలుగుచూస్తూనే ఉంటాయి. గతేడాది సెప్టెంబర్​లో భారత్​ను బర్డ్ ​ఫ్లూ రహిత దేశంగా ప్రకటించాం. చలికాలం నేపథ్యంలో.. అక్టోబర్​లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాం. ఇప్పుడు వలస పక్షులు ఎక్కువగా వచ్చిన రాష్ట్రంలోనే కేసులు నమోదవుతున్నాయి. ఇదే వైరస్​ మళ్లీ దేశంలోకి ప్రవేశించడానికి ప్రధాన కారణం.''

- గిరిరాజ్​ సింగ్​, కేంద్ర పాడి, పశు సంవర్థక శాఖ మంత్రి​

ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు.. ఇప్పటికే దీనిపై దిల్లీలో కంట్రోల్​ రూం ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి వివరించారు. వైరస్​ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్రాలకు నిర్దేశించారు.

పౌల్ట్రీ పరిశ్రమ నిర్వాహకులు భయపడాల్సిన పనిలేదని, కేంద్రం పరిహారం అందిస్తుందని తెలిపారు.

ఇదీ చూడండి:'బర్డ్​ ఫ్లూ' కోసం ప్రత్యేక కంట్రోల్​ రూమ్

రాజస్థాన్​లోని బరన్​, కోటా, ఝాలావాడ్​ జిల్లాల్లో, మధ్యప్రదేశ్​లోని మంద్​సౌర్​, ఇందోర్​, మల్వా జిల్లాల్లోని కాకుల్లో బర్డ్ ​ఫ్లూ గుర్తించినట్లు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. హిమాచల్​ ప్రదేశ్​ కాంగ్రాలో వలస పక్షుల్లో, కేరళలోని కొట్టాయం, అలప్పుజాలో బాతుల్లో ఈ వైరస్​ను గుర్తించినట్లు వివరించింది.

బర్డ్​ ఫ్లూ ఏ రాష్ట్రంలో ఎలా..

  • కేరళలో ఇప్పటివరకు 25 వేల బాతులు చనిపోయాయని కేరళ పశుసంవర్థక శాఖ మంత్రి కే రాజు వెల్లడించారు. ఈ కారణంగా సమీపంలోని 40 వేలకుపైగా పక్షులను వధించాల్సి ఉంటుందని తెలిపారు. బర్డ్​ ఫ్లూను రాష్ట్ర విపత్తుగా ప్రకటించామని, హై అలర్ట్​ జారీ చేశామని స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తిపై సమీక్షించేందుకు.. కేంద్రం కూడా అలప్పుజా, కొట్టాయంలకు వేర్వేరు విభాగాలకు చెందిన నిపుణుల బృందాలను పంపింది.
  • మధ్యప్రదేశ్​లోని 10 జిల్లాల్లో ఇప్పటివరకు 400 కాకులు మృత్యువాతపడ్డాయని రాష్ట్ర మంత్రి ప్రేమ్​ సింగ్​ పటేల్​ తెలిపారు. సంరక్షణ చర్యలకు ఉపక్రమించినట్లు పేర్కొన్నారు. కేరళ సహా ఇతర దక్షిణాది రాష్ట్రాల నుంచి గుడ్లు, కోళ్లు దిగుమతులపై 10 రోజుల పాటు నిషేధం విధిస్తున్నట్లు మధ్యప్రదేశ్​ ప్రభుత్వం ప్రకటించింది.
  • హిమాచల్​ప్రదేశ్​లోని కాంగ్రా జిల్లాలో మంగళవారం వరకు 2400కుపైగా వలస పక్షులు మరణించాయి. ఈ తరుణంలో కాంగ్రాకు 10 కి.మీ. పరిధిలో హై అలర్ట్​ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. పౌల్ట్రీ మార్కెట్లు మూసివేశారు. కోడిగుడ్ల అమ్మకాలపై నిషేధం విధించారు.
  • రాజస్థాన్​లోనూ పక్షులు ఎక్కువ సంఖ్యలో చనిపోతున్నాయి. ఇది పౌల్ట్రీ పరిశ్రమకు తీరని నష్టం కలిగిస్తోందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి లాల్​చంద్​ కఠారియా ఆవేదన వ్యక్తం చేశారు.

ఏటా సెప్టెంబర్- అక్టోబర్ నుంచి ఫిబ్రవరి- మార్చిలో విడిది కోసం భారత్‌కు వచ్చే విదేశీ విహంగాలతోనే ప్రధానంగా బర్డ్‌ ఫ్లూ దేశంలోకి వస్తున్నట్లు కేంద్రం తెలిపింది. 2006లో మొట్ట మొదటిసారి దేశంలో బర్డ్ ‌ఫ్లూ కలకలం రేగింది. 2020 సెప్టెంబర్‌ 30న భారత్‌ను బర్డ్‌ఫ్లూ రహిత దేశంగా ప్రకటించగా.. ఇప్పుడు మళ్లీ పలు రాష్ట్రాల్లో ఎక్కువగా పక్షులు మృత్యువాతపడుతున్నాయి.

అప్రమత్తం..

కేరళలో బర్డ్​ ఫ్లూ నేపథ్యంలో.. పొరుగు రాష్ట్రం కర్ణాటక అప్రమత్తమైంది. పౌల్ట్రీ సరఫరాను నిలిపివేసింది. వ్యాధి నియంత్రణలో భాగంగా.. కేరళ నుంచి వాహనాలనూ శానిటైజ్​ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కోళ్లు, పక్షులు వంటివి సహజంగా చనిపోయినా సమాచారం అందించాల్సిందిగా మైసూర్​ జిల్లా కలెక్టర్​ రోహిణి సింధూరి ఆదేశించారు.

ఇదీ చూడండి: విస్తరిస్తున్న బర్డ్​ ఫ్లూ- మధ్యప్రదేశ్​కు వ్యాప్తి

ABOUT THE AUTHOR

...view details