మహారాష్ట్ర.. పుణెలో ఉన్న గూగుల్ కార్యాలయంలో బాంబు ఉందని బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు, పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. చివరకు అది బూటకమని అని తేలింది. అయితే ఈ బెదిరింపు కాల్కు పాల్పడ్డ వ్యక్తిని.. హైదరాబాద్లో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు.
'గూగుల్ ఆఫీస్లో బాంబు'.. పోలీసులను తిప్పలు పెట్టిన హైదరాబాదీ - పుణె గూగుల్ ఆఫీస్ వార్తలు
పుణె గూగుల్ కార్యాలయంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు చేపట్టారు. ఆ తర్వాత ఏమైందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ఉన్న గూగుల్ ఆఫీస్కు ఆదివారం ఓ వ్యక్తి కాల్ చేశాడు. పుణె.. కోరేగావ్ పార్క్లో ఉన్న గూగుల్ కార్యాలయంలో బాంబు ఉన్నట్లు తెలిపాడు. వెంటనే ముంబయి పోలీసులకు కార్యాలయ సిబ్బంది సమాచారం అందించారు. వారు అప్రమత్తమై పుణె పోలీసులకు విషయాన్ని చేరవేశారు. హుటాహుటిన పుణె పోలీసులు.. గూగుల్ కార్యాలయానికి చేరుకున్నారు. బాంబు డిటెక్షన్ స్క్వాడ్ సహాయంతో విస్తృత తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలో ఎక్కడా ఎలాంటి అనుమానస్పద వస్తువులు లభించలేదు. ఎలాంటి బాంబు లేదని, అది బూటకపు కాల్ అని నిర్ధరించుకున్నారు.
కాగా, గూగుల్ సంస్థ తరపున దిలీప్ తాంబే.. ఈ ఘటనపై ముంబయిలోని బీకేసీ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్కు చెందిన పాణ్యం బాబు శివానంద్ అనే వ్యక్తి కాల్ చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్ చేరుకుని అతడిని అరెస్ట్ చేశారు. అతడు మద్యం మత్తులో కాల్ చేశాడని పోలీసులు తెలిపారు. ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోందని చెప్పారు.