Mahua Moitra Latest News : పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణల కేసులో ఎథిక్స్ కమిటీ ఛైర్‌పర్సన్ వినోద్ కుమార్ వస్త్రాపహరణ చేశారంటూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ప్రశ్నలకు బదులుగా హానికరమైన, తన పరువుకు నష్టం కలిగించేలా పక్షపాతంతో వ్యవహరించారని మహువా ఫిర్యాదు చేశారు.
Mahua Moitra Cash For Question : ఎథిక్స్ కమిటీ నైతికత కోల్పోయినందున.. ఆ కమిటీకి వేరే పెట్టాలన్నారు మహువా మెయిత్రా. తన పరువుకు నష్టం కలిగించే విధంగా ప్రశ్నించడం ద్వారా ఎథిక్స్ కమిటీ ఛైర్‌పర్సన్ పక్షపాతంతో వ్యవహరించారని, ఆయన తీరుతో 11మంది కమిటీ సభ్యుల్లో ఐదుగురు సమావేశాన్ని బహిష్కరించినట్లు మహువా తెలిపారు. లోక్‌సభలో అడిగే ప్రశ్నలకు సంబంధించిన పోర్టల్.. లాగిన్, పాస్‌వర్డ్ షేరింగ్‌కు సంబంధించిన నిబంధనలు వెల్లడించాలని లోక్‌సభ సచివాలయానికి రాసిన లేఖలో మహువా కోరారు. ఎంపీలకు ఈ నియమాలు ఎందుకు ఇవ్వలేదన్న మహువా.. అలాగైతే ప్రతి ఒక్క ఎంపీ తమ లాగిన్ ఐడిని అనేకమంది వ్యక్తులతో ఎందుకు పంచుకుంటున్నారని ప్రశ్నించారు.
'ప్యానెల్ సభ్యులు దుర్యోధనుడిలా.. ఛైర్మన్ దృతరాష్ట్రుడిలా..'
పార్లమెంటు ఎథిక్స్ కమిటీ సభ్యులు వ్యక్తిగత ప్రశ్నలు అడిగారంటూ టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా చేసిన ఆరోపణలపై బంగాల్ మంత్రి శశి పంజా స్పందించారు. బీజేపీ నిశ్శబ్ద ప్రేక్షకుడిగా ఉందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్యానెల్ సభ్యులు.. మహాభారతంలోని దుర్యోధనుడిలా ఆనందిస్తుంటే.. ఛైర్మన్ ధృతరాష్ట్రుడిలా కూర్చున్నారని ఆరోపించారు. మహిళా సాధికారత అంటూ బీజేపీ బూటకపు ప్రకటనలు ఇస్తున వేళ.. ప్రజలు ఎన్నుకున్న మహిళా ఎంపీని ప్యానెల్ అవమానించిందని ఆరోపణలు చేశారు. 'మహిళా సాధికారత, మహిళల భద్రతపై బీజేపీ పెద్ద ఎత్తున ఉపన్యాసాలు ఇస్తోంది. కానీ ఈరోజు ప్యానెల్‌లోని బీజేపీ సభ్యులు దుర్యాధనుడిలా, ఛైర్మన్ ధృతరాష్ట్రుడిలా కూర్చున్నారు. మొయిత్రాను వ్యక్తిగత ప్రశ్నలు అడిగి అవమానించారు" అని శశి పంజా ఆరోపించారు.