సూపర్ 'ఈ-సైకిల్'.. 10 పైసలతో కి.మీ ప్రయాణం ఆ యువకుడికి యంత్రాలు అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి. కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడం బాల్యం నుంచి అలవాటే. తాను చేసే ఆవిష్కరణ పేదలకు ఉపయోగంగా ఉండాలని భావించాడు. దీంతో బ్యాటరీతో నడిచే సైకిల్‌ను రూపొందించాడు. కేవలం పది పైసలకే కిలోమీటర్ దూరం ప్రయాణించేలా అతితక్కువ ఖర్చుతో సైకిల్‌ను తయారు చేశాడు మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు.
రాష్ట్రంలోని ఛతర్‌పుర్ జిల్లాకు చెందిన ఆదిత్య శివ్‌హరే(20) అనే యువకుడు.. చిన్నప్పటి నుంచి యంత్రాలు, ఆవిష్కరణల పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడు. ఎప్పుడూ ఏదో తయారు చేస్తూ వివిధ స్థాయిల్లో ఎన్నో అవార్డులను అందుకున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా బ్యాటరీతో నడిచే సైకిల్‌ను రూపొందించాడు. దీనికోసం నెల రోజుల పాటు కష్టపడి ఈ- బైస్కిల్‌ను తయారుచేశాడు.
బ్యాటరీ సైకిల్ రూపకర్త ఆదిత్య రూ.20వేల ఖర్చుతో..
ఈ బ్యాటరీ సైకిల్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది వందకిలోల బరువును మోసుకెళ్తుందని ఆదిత్య చెబుతున్నాడు. దీనిని తయారుచేసేందుకు 20వేల రూపాయల ఖర్చు అయినట్లు తెలిపాడు. ఒకసారి ఈ సైకిల్‌కు ఫుల్ ఛార్జ్ చేస్తే 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని వివరించాడు. ఈ సైకిల్ వల్ల ఒక కిలోమీటర్ దూరానికి కేవలం 10 పైసలు మాత్రమే ఖర్చు అవుతుందని వెల్లడించాడు. ఈ సైకిల్‌కు బైక్‌కు ఉండే కొన్ని సౌకర్యాలను ఆదిత్య కల్పించాడు. యాక్సెలరేటర్, బ్రేక్, లైట్, హారన్, మొబైల్ స్టాండ్‌ను ఏర్పాటు చేశాడు.
మార్కెట్లో విడుదలైనే విప్లవమే!
పేదవారిని దృష్టిలో పెట్టుకుని ఈ సైకిల్‌ను తయారు చేసినట్లు ఆదిత్య తెలిపాడు. పెట్రోల్ ధరలు పెరగడం, ఎలక్ట్రిక్ బైక్‌ల ధరలు లక్షకు పైనే ఉండటంతో పేదల కోసం దీన్ని రూపొందించినట్లు పేర్కొన్నాడు. ఈ సైకిల్ మార్కెట్‌లో విడుదలైతే విప్లవం సృష్టిస్తుందని తెలిపాడు. ఈ బ్యాటరీ సైకిల్‌కు A-1 అని పేరు కూడా పెట్టాడు.
ఆదిత్య రూపొందించిన ఎలక్ట్రిక్ సైకిల్ 16 ఏళ్ల వయసులోనే..
16 ఏళ్ల వయసులోనే వైర్లు లేకుండా విద్యుత్‌ను తయారు చేసినట్లు ఆదిత్య తెలిపాడు. ఈ ప్రయోగం కేవలం మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచే కాకుండా ప్రధాని నరేంద్రమోదీ నుంచి కూడా ప్రశంసలు అందుకుందని గుర్తుచేశాడు. బల్బును కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ తనకు స్ఫూర్తి అని ఆదిత్య చెబుతున్నాడు. ప్రభుత్వం చొరవ చూపి తన ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లాలనేది తన కల అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. చిన్నతనం నుంచి ఆదిత్యకు యంత్రాలు, వాటిని వేరుచేసి బిగించడం అలవాటు అని తల్లి విమల శివ్‌హరే చెబుతున్నారు.