Kerala Baby Girl Murder: ఏడాదిన్నర చిన్నారిని నీళ్ల బకెట్లో ముంచి హత్య చేసిన అమానుష ఘటన కేరళ ఎర్నాకుళం జిల్లాలో వెలుగుచూసింది. ఓ హోటల్ గదిలో బామ్మ ప్రియుడే.. చిన్నారిని చంపేశాడు.
ఇదీ జరిగింది
జిల్లాలోని కలూరు గ్రామానికి చెందిన వృద్ధ తల్లిదండ్రుల కుమార్తె విదేశాల్లో ఉంటుంది. ఆమె పిల్లలు.. ఈ వృద్ధ దంపతులతో కేరళలోనే ఉంటున్నారు. ఆ పిల్లలను గంజాయి స్మగ్లింగ్‌కు ఉపయోగించుకుంటున్నారు బామ్మ, ఆమె ప్రియుడు జాన్ బినోయ్. ఈ విషయమై గతంలో బామ్మకు, జాన్ మధ్య వివాదాలు తలెత్తాయి.
నీళ్ల బకెట్లో ముంచి..
ప్రియుడితో హోటల్‌కు వెళ్లిన బామ్మ.. తనతో పాటు చిన్నారిని తీసుకెళ్లింది. చిన్నారిని హోటల్ గదిలోనే జాన్ వద్ద ఉంచి.. ఏదో పనిమీద బయటకు వెళ్లింది ఆమె. ఇదే అదునుగా ఆ పసికందును నీళ్ల బకెట్లో ముంచేసి హత్య చేశాడు జాన్. ఆ హత్యను సాధారణ మృతిగా చిత్రీకరించేందుకు జాన్ ప్రయత్నించాడు. ఆ చిన్నారి పాలు తాగుతుండగా ఊపిరాడక ఇబ్బందిపడుతోందని ప్రియురాలితో చెప్పాడు. దీంతో ఆ చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే పసికందు మృతి చెందినట్లు వైద్యులు గుర్తించి పోస్టుమార్టం నిర్వహించారు. ఫోరెన్సిక్ సర్జన్ ఊపిరితిత్తుల్లో నీరు ఉన్నట్లు గుర్తించి హత్యగా నిర్ధరించారు.
జాన్‌తో పాటు చిన్నారి బామ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించాక అరెస్ట్ చేశారు. అయితే హత్య జరిగినప్పుడు చిన్నారి బామ్మ బయటకు వెళ్లిందని నిర్ధరించుకున్న పోలీసులు.. ఆమెను అరెస్టు చేయలేదు. ఈ పిల్లలను ఆ బామ్మ, ఆమె ప్రియుడు గంజాయి స్మగ్లింగ్‌కు ఉపయోగించుకున్నట్లు అధికారులకు కొన్ని ఆధారాలు లభించాయి. దీనిపై తలెత్తిన వివాదమే హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు.. గెలుపుపై పార్టీల ధీమా