బెంగళూరు రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన సొరంగ అక్వేరియం బెంగళూరు అంటే తోటలు, ఐటీ నగరంగా చెబుతారు. ఐటీ కార్యాలయాలు కొలువైన అద్దాల మేడలు, ఆహ్లాదపరిచే తోటలతో మనసుకు ఉల్లాసాన్ని, ఆహ్లాదాన్ని పంచుతూ ఉంటుంది బెంగళూరు. అలాంటి నగర సిగలో మరో వన్నె చేరింది. దేశంలో రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన తొలి సొరంగ అక్వేరియం అందుబాటులోకి వచ్చింది. బెంగళూరులోని క్రాంతివీర సంగోలి రాయన్న రైల్వే స్టేషన్‌లో గురువారం దీన్ని ప్రారంభించారు.
రైల్వే స్టేషన్‌లో సొరంగ అక్వేరియం రైల్వే స్టేషన్‌కు వచ్చే వారికి మాత్రమే కాదు బెంగళూరు ప్రజలు, అక్కడికి విచ్చేసే పర్యాటకులను ఆకట్టుకునేందుకు బెంగళూరు కేఎస్ఆర్ రైల్వే స్టేషన్‌లో ఈ సొరంగ అక్వేరియంను ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్పొరేషన్, హెచ్ఎన్ఐ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ సంయుక్తంగా దీనికి రూపకల్పన చేసింది.
ఆకట్టుకునే రకరకాలైన చేపలు, తాబేళ్లు, పీతలు ఈ అక్వేరియంలో ఉంచారు. బ్లాక్ డైమండ్, స్టింగ్ రే, హై ఫిన్ షార్క్‌లు, సముద్రపు తాబేళ్లు, చుక్కల చేపలు, జెల్లీ చేప వంటివి ఇక్కడ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
అక్వేరియంలో సరదాగా సందర్శకురాలు బెంగళూరు కేఎస్ఆర్ రైల్వే స్టేషన్‌లో రకరకాలైన మొక్కలను కూడా నాటారు. అమెజాన్ వర్షపు అడవుల నమూనా ఇక్కడి మరో ప్రత్యేకత. పిల్లల కోసం ఇక్కడ ప్రత్యేక సెల్ఫీ పాయింట్‌లను ఏర్పాటు చేశారు. ఈ అక్వేరియం ప్రవేశ రుసుము రూ.25. కనువిందు చేస్తున్న ఈ అక్వేరియం బెంగళూరుకు కొత్త గుర్తింపు తీసుకువస్తుందని అంటున్నారు అక్కడి నిర్వాహకులు.
ఇదీ చూడండి:'రైళ్లలో టికెట్ లేకుండా 27 లక్షల మంది ప్రయాణం'