తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మూడు వైపులా నది.. ఒకవైపు పాక్​ సరిహద్దు.. ఆ ఊరి రాత మారేదెప్పుడు? - Congress MLA

పల్లెసీమలే దేశానికి పట్టకొమ్ములు అన్నారు పెద్దలు. 75వ స్వాతంత్ర్య వేడుకులకు సిద్ధమవుతున్న వేళ.. భారతదేశంలో నేటికీ కనీస సౌకర్యాలకు నోచుకోని గ్రామాలు ఎన్నో. ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తుకొచ్చి.. గెలిచాక పాలకులు మరిచిపోయే ఊళ్ల చిట్ట చాలా పెద్దదే. అలాంటి ఓ ఊరి దీన గాథను ఇప్పుడు తెలుసుకుందాం. పాక్​కు కూతవేటు దూరంలో ఉండి.. మూడువైపులా నది.. ఒకవైపు సరిహద్దు రహదారితో.. సకల సమస్యలతో అల్లాడిపోతూ.. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజాప్రతినిధులకు గుర్తొచ్చే పంజాబ్​ ద్వీపకల్పం 'కలువాలా' వ్యథ గురించి ఎంత చెప్పుకున్నా.. తక్కువే. అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఈ కలువాలా అంశం మరోసారి చర్చకు వచ్చింది.

Amid poll promises galore in Punjab, a border village long neglected
మూడు వైపులా నది.. ఒకవైపు పాక్​ సరిహద్దు.. ఆ ఊరి రాత మారేదెప్పుడు?

By

Published : Feb 10, 2022, 6:20 PM IST

Updated : Feb 10, 2022, 6:46 PM IST

మూడు వైపులా నది.. ఒకవైపు పాక్​ సరిహద్దు

రవాణా సౌకర్యం లేక అవస్థలు.. ప్రాథమిక వైద్యానికి కూడా పట్టణానికి పరుగులు.. పాఠశాల ఉన్నా ఉపాధ్యాయులు కరవు.. రాత్రి ఏడు గంటలు దాటితే ఊరికి రాకపోకలు బంద్​.. ఒకవేళ రాత్రి పూట అనారోగ్యం పాలయ్యారా? బీఎస్​ఎఫ్​ అధికారులు అనుమతిస్తేనే అస్పత్రికి.. లేకపోతే అంతే సంగతులు.. పాకిస్థాన్​కు కూతవేటు దూరంలో పంజాబ్​ ఫిరోజ్​పుర్ జిల్లాలోని 'కలువాలా' గ్రామాన్ని ఈటీవీ భారత్​ బృందం సందర్శించినప్పుడు ఇలాంటి అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయి. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా.. ఈ ఊరు రాత మాత్రం మారలేదు. ఎన్నికల హామీలను విస్మరించిన పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది కలువాలా. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. కలువాలా అంశం మరోసారి చర్చకు వచ్చింది.

నది ఏకైక రవాణా మార్గం

పాకిస్థాన్​ సరిహద్దుకు ఆనుకొని ఉండే.. ఈ కలువాలా గ్రామం పాలకులకు ఎన్నికలొచ్చినప్పుడే గుర్తొస్తుంది. 400మంది జనాభా ఉండే ఈ గ్రామంలో అన్నీ నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలే. ఊరికి మూడు వైపులా సట్లెజ్ నది ఉంటుంది. ఒక వైపు పాకిస్థాన్​ సరిహద్దు. దీంతో నదే ఈ ఊరికి ఏకైక రవాణా మార్గం. సరిహద్దు గ్రామం కావడం వల్ల రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు ఆ పడవ మార్గాన్ని కూడా మూసేస్తారు. అయితే దశాబ్దాలుగా.. ఆ నదిపై వంతెన కట్టాలని గ్రామస్థులు కోరుతున్నా.. పాలకులు పట్టించుకోకపోవడం వల్ల అది హామీగానే మిగిలిపోయింది.

పాక్ సరిహద్దు కావడం వల్ల ఇక్కడ బీఎస్​ఎఫ్​ భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. రాత్రి ఏడు దాటితే.. ప్రపంచంతో గ్రామానికి ఎలాంటి సంబంధాలు ఉండవు. ఆ సమయంలో తాము భారతీయులమైనా.. పాక్​లో ఉన్నట్లే అనిపిస్తుందని చెబుతున్నారు గ్రామస్థులు. ఎవరికైనా రాత్రి అనారోగ్య సమస్యలు తలెత్తితే.. సమీప పట్టణానికి సరిహద్దు వెంట ఉంటే రహదారి గుండా వెళ్లాల్సి ఉంటుంది. అయితే బీఎస్​ఎఫ్ అధికారులు అనుమతిస్తేనే వెళ్లాలి. ఒకవేళ వాళ్లు అనుమతి ఇవ్వడం ఆలస్యమైతే.. ప్రాణాలు పోయిన సందర్భాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో తనకు ఎదురైన అనుభవాన్ని ఈటీవీ భారత్​తో పంచుకున్నారు గ్రామస్థుడు దర్శన్ సింగ్.

"కొద్ది రోజుల క్రితం నా కూతురు అనారోగ్యానికి గురైంది. బీఎస్​ఎఫ్​ జవాన్లకు మా ఐడీ ఆధారాలు చూపించాం. అయితే చాలా సేపటికి మేము వెళ్లేందుకు అనుమతించారు."

-దర్శన్ సింగ్, గ్రామస్థుడు

ఆ ఐదుగురే..

గ్రామం ఏర్పడి దశాబ్దాలు కావొస్తున్నా.. కలువాలులో ఇప్పటివరకు ఐదుగురు మాత్రమే 12వ తరగతికి అర్హత సాధించడం గమనార్హం. ఊరిలో గతేడాది వరకు పాఠశాల లేదు. ప్రభుత్వానికి పలు సార్లు లేఖలు రాయగా.. గతేడాది పాఠశాలను నిర్మించినట్లు చెప్పారు స్థానికుడు పరంజిత్ సింగ్. అయితే ఆ పాఠశాలలో ప్రస్తుతం టీచర్​ లేరని చెప్పుకొచ్చారు.

"గ్రామంలో పారిశుద్ధ్య లోపం ఉంది. కలుషితమైన నీరు తాగడం వల్ల చాలా మంది వ్యాధుల బారిన పడుతున్నారు. గ్రామంలో ఆస్పత్రి లేకపోవడం వల్ల 10కిలోమీటర్ల దూరంలో ఉన్న దవాఖానకు వెళ్లాల్సి వస్తోంది. ప్రైవేటు డాక్టర్లు గ్రామంలో వైద్యం చేస్తున్నప్పటికీ ఎక్కువ మొత్తంలో డబ్బు వెచ్చిస్తున్నాం. రాత్రిపూట ఎవరైనా అనారోగ్యానికి గురైతే.. సరిహద్దు రహదారి గుండా వెళ్లాలి. అప్పుడు రహదారి మూసి ఉంటుంది. ఆ సమయంలో మాకు పాకిస్థాన్‌లో ఉన్నట్లే అనిపిస్తుంది."

పరంజిత్ సింగ్, స్థానికుడు

ఒక్క దుకాణం లేదు..

ఎన్నికలప్పుడు తమ ఊరికి రాజకీయ నాయకులు వచ్చి వాగ్దానాలు చేసి.. ఆ తర్వాత మరిచిపోవడం పరిపాటిగా మారిందనేది స్థానికుల వాదన. నదిపై వంతెన కడితే.. రవాణా పరంగా అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ప్రధానంగా పండించిన పంటలను పట్టణానికి చేరవేయడానికి సులువు అవుతుందని రైతులు ఆశ పడుతున్నారు.

పేదలు, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఈ గ్రామంలో ఒక్క దుకాణం కూడా లేదు. బ్యాంకు సేవలకు కూడా ఇక్కడి జనం పట్టణానికి వెళ్లాల్సి వస్తోంది. విద్యుత్​ కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పాలకులు కన్నెత్తి చూడటం లేదని వాపోతున్నారు.

ఐదేళ్లలో ఎమ్మెల్యే పర్మీందర్ సింగ్ పింకీ తమ గ్రామాన్ని మూడు సార్లు మాత్రమే సందర్శించారని పంచాయతీ సభ్యుడు జోగిందర్ సింగ్ తెలిపారు. ఇటీవల ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు గ్రామానికి ఫిరోజ్‌పూర్‌తో అనుసంధానించడానికి నదిపై వంతెన నిర్మాణానికి కృషి చేయాలని ఆయనను కోరినట్లు చెప్పారు జోగిందర్.

"గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక మా ఎమ్మెల్యే ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఓట్లు అడిగేందుకు వచ్చారు’"

- జోగిందర్ సింగ్, పంచాయతీ సభ్యుడు

ఇదిలా ఉంటే.. సరిహద్దు కాల్పులు జరుగుతున్న సమయంలో తాము భయాందోళనకు గురవుతున్నామన్నారు మరో గ్రామస్థుడు ఫౌజా సింగ్.

గ్రామంలో ప్రభుత్వ ఇల్లు ఒక్కటి మంజూరు కాకపోవడం గమనార్హం. 'మేము 25 ఏళ్లుగా గ్రామంలో నివాసం ఉంటున్నాం. ప్రభుత్వం ఇల్లు కట్టుకోవడానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మా ఊరిలో ఒక్క మరుగుదొడ్డి కూడా లేదు. దీనిపై నేను ఫిర్యాదు కూడా చేశా.' అని గ్రామానికి చెందిన వృద్ధురాలు గుర్దయాల్ కౌర్ అన్నారు.

అయితే కలువాలా గ్రామంలో అభివృద్ధి పనులు జరగకపోవడానికి ఎమ్మెల్యే పర్మీందర్ సింగ్ నిర్లక్ష్యమే కారణం అంటూ.. శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడీ)-బీఎస్పీ ఉమ్మడి అభ్యర్థి రోహిత్ మోంటు, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి రణబీర్ సింగ్ భుల్లర్ ఆరోపించారు. తన సొంత ఇంటిని రూ. కోట్లు పెట్టి విలాసంగా నిర్మించుకున్న ఎమ్మెల్యే.. ప్రజల కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని విమర్శలు గుప్పిస్తున్నారు.

పాక్​తో కీలకమైన సరిహద్దును పంచుకుంటున్న కలువాలా గ్రామం అభివృద్ధిలో వెనకపడటం.. ఏ ఒక్క పార్టీ నిర్లక్ష్యం కాదని.. గత దశాబ్దాలుగా ఎన్ని ప్రభుత్వాలు పాలించాయో.. ఆ పాలకుల చిన్నచూపే ఆ ఊరుకు కనీస సౌకర్యాలను దూరం చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Last Updated : Feb 10, 2022, 6:46 PM IST

ABOUT THE AUTHOR

...view details