దిల్లీ నుంచి జమ్ముకశ్మీర్‌పై దాడి జరుగుతోందని అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అసెంబ్లీ ఎన్నికలకు ముందే జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అప్పుడే ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయన్నారు.
రెండు రోజుల కశ్మీర్ పర్యటనలో భాగంగా ముందుగా గందెర్బాల్లోని కశ్మీరీ పండిత్‌ల ఆరాధ్య దైవం మాతా ఖీర్ భవానీ అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు రాహుల్ గాంధీ. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం శ్రీనగర్‌లో పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించారు. కార్యకర్తలు, మద్దతుదారులతో మాట్లాడారు.
" భారత్‌ను విభజిస్తున్నందుకే ప్రధాని మోదీ, ఆయన విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నా. విజయం సాధించేవరకు నా పోరాటం కొనసాగుతుంది. ప్రస్తుతం కేంద్రం జమ్ముకశ్మీర్పైనే దాడి చేయటం లేదు. తమిళనాడు, బంగాల్ సహా ఇతర రాష్ట్రాలపైనా దాడికి పాల్పడుతోంది. అయితే.. ఇతర రాష్ట్రాలు పరోక్షంగా ప్రభావితమైతే.. జమ్ముకశ్మీర్ నేరుగా దిల్లీ నుంచి దాడికి గురవుతోంది. జమ్ముకశ్మీర్‌పై కాంగ్రెస్ వైఖరి స్పష్టంగా ఉంది. రాష్ట్ర హోదా ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేసి, అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి.
నేను కశ్మీర్ ప్రజలతోనే ఉన్నా. ప్రేమ, గౌరవంతో మీతో సంబంధం ఏర్పరుచుకోవాలనుకుంటున్నా. కరోనా సమయంలో ఇక్కడకు రావాలనుకున్నా. కానీ, నన్ను అనుమతించలేదు. ఈ రోజు మా కుటుంబం దిల్లీలో నివసిస్తోంది. కానీ, అంతకుముందు కశ్మీర్‌లోనే ఉన్నారు. మా కుటుంబం సైతం జీలమ్ నది నీటిని తాగింది. నాలో కూడా కశ్మీరీ లక్షణాలు ఉన్నాయి. ఇక్కడకు వస్తే.. సొంత ఇంటికి వచ్చినట్లుగా అనిపిస్తోంది. త్వరలోనే జమ్ము, లద్దాఖ్‌కు వెళ్తాను. "
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత.
జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించే బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కోరారు. ఆయన డిమాండ్‌పై స్పందిస్తూ.. 'పార్లమెంట్లో చాలా విషయాలపై మాట్లాడాలని ఉంది. కానీ మాట్లాడేందుకు నాకు అనుమతి లేదు. రఫేల్, నిరుద్యోగం, అవినీతి వంటి సమస్యలపై మాట్లాడలేకపోతున్నా. న్యాయవ్యవస్థ, లోక్‌సభ సహా మీడియా నోరును భాజపా నొక్కుతోంది.' అని మండిపడ్డారు రాహుల్.
అంతకుముందు కశ్మీర్‌లోని ప్రముఖ హజ్రత్బల్ మసీదును సందర్శించారు రాహుల్ గాంధీ. దేశం సుఖశాంతులతో సుసంపన్నగా వర్ధిల్లాలని కోరుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి:'ప్రతి భారతీయుడి ఫోన్‌ను మోదీ ట్యాప్ చేశారు'