తెలంగాణ

telangana

By

Published : Jul 20, 2021, 1:30 PM IST

Updated : Jul 20, 2021, 2:17 PM IST

ETV Bharat / bharat

'కరోనా మరణాలు.. కేంద్రం లెక్కలకన్నా 10 రెట్లు అధికం!'

భారత్​లో కరోనా కాలంలో సంభవించిన మరణాల సంఖ్యపై ఓ అధ్యయనంలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. మహమ్మారి సమయంలో మృతుల సంఖ్య.. కేంద్ర ప్రభుత్వం చెప్పే లెక్కకు 10 రెట్లు అధికంగా ఉంటుందని తెలిసింది.

Arvind Subramanian, report on Covid19 toll
'కరోనా మరణాలు.. కేంద్రం లెక్కలకన్నా 10రెట్లు అధికం!'

4,14,482... కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం భారత్​లో మొత్తం కరోనా మరణాల సంఖ్య ఇది. కానీ... మహమ్మారి సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారి అసలు సంఖ్య ఇందుకు 10 రెట్లు ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. కేంద్ర ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, సెంటర్​ ఫర్​ గ్లోబల్​ డెవలప్​మెంట్​, హార్వర్డ్​ యూనివర్సిటీకి చెందిన మరో ఇద్దరు పరిశోధకులు ఈమేరకు మంగళవారం ఓ నివేదిక విడుదల చేశారు. 2020 జనవరి, 2021 జూన్​ మధ్య ప్రభుత్వం చెప్పిన లెక్కలకు, వాస్తవ గణాంకాలకు మధ్య కనీసం 30 లక్షల నుంచి 47 లక్షల మేర తేడా ఉంటుందని అంచనా వేశారు.

'భారత్​లో మరణాల అసలు లెక్క.. మిలియన్లలో ఉంటుంది. స్వతంత్ర భారత దేశ చరిత్రలో అతిపెద్ద మానవ విషాదం కరోనానే ' అని నివేదికలో పేర్కొన్నారు ఆ నిపుణులు.

కరోనా మరణాల సంఖ్య వాస్తవ లెక్కలకంటే తక్కువగా ఉందని గతంలోనూ ఇలాంటి వాదనలే వినిపించగా.. కేంద్రం వాటిని తోసిపుచ్చింది.

మూడు విధానాలు..

జూన్ 21 వరకు భారత్‌లో సంభవించిన అదనపు మరణాలను అంచనా వేసేందుకు మూడు భిన్న సమాచార వనరులను అధ్యయనంలో ఉపయోగించారు . అందులో మొదటగా... భారత జనాభాలో సగం వాటాను కలిగిన ఏడు రాష్ట్రాల్లోని జనన, మరణాల నమోదును పరిశోధకులు పరిగణనలోకి తీసుకున్నారు. భారత్​లో కరోనా ఆనవాళ్లు ఉన్న రక్త పరీక్షల ఫలితాలు, ప్రపంచవ్యాప్తంగా మరణాల రేట్లను రెండో విధానంగా తీసుకున్నారు. ఏడాదిలో రెండు సార్లు జరిగే ఆర్థిక సర్వేలో పాల్గొన్న 9 లక్షల మంది వివరాలను పరిశీలించారు. గత నాలుగు నెలల కాలంలో ఆయా కుటుంబాలలో ఎవరైనా కొవిడ్‌తో మరణించారా అనే విషయాలను సేకరించారు.

వీటిన్నింటినీ పరిశీలించిన అనంతరం భారత్‌లో ప్రభుత్వం చెప్పిన లెక్కలకంటే అదనపు మరణాలు 30 లక్షల నుంచి 47 లక్షల వరకు ఉండొచ్చని పరిశోధకులు అంచనా వేశారు. వాస్తవ లెక్కల కంటే పది రెట్లు అధికంగా మరణాలు ఉండొచ్చన్నారు. అయితే కొవిడ్‌తోనే 40లక్షల మంది చనిపోయారని చెప్పలేమని అరవింద్ సుబ్రమణియన్ పేర్కొన్నారు. కొవిడ్ వాస్తవ మరణాలు ఎన్ని అని.. కచ్చితంగా అంచనా వేయడం కష్టసాధ్యమన్నారు. అయితే మహమ్మారి తీవ్రతను అదనపు మరణాలు తెలియజేస్తాయని స్పష్టం చేశారు.

ఈ అధ్యయాన్ని సమీక్షించిన డా.జాకబ్​ జాన్​.. కరోనా మొదటి దశలో దాదాపు 20 లక్షల మంది మరణించి ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈయన వెల్లోర్​లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్​లో వైరస్​లపై అధ్యయనాలు చేస్తున్నారు. ఆరోగ్య వ్యవస్థ లోపాల కారణంగా భారత్​పై కొవిడ్ తీవ్ర ప్రభావం చూపిందన్నారు.

ఇదీ చదవండి :కరోనా ఉద్ధృతి- మరో రెండేళ్ల వరకు ఇంతే!

Last Updated : Jul 20, 2021, 2:17 PM IST

ABOUT THE AUTHOR

...view details