Hijab Supreme Court: ప్రతి వ్యక్తికీ మత స్వేచ్ఛ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే నిర్దిష్ట ఏకరూప దుస్తులు ధరించాలనే నిబంధన ఉన్న పాఠశాలల్లోనూ మత స్వేచ్ఛను వినియోగించుకోవచ్చా లేదా అన్నదే ప్రస్తుతం ఉత్పన్నమవుతున్న ప్రశ్న అని పేర్కొంది. కర్ణాటకలోని విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాన్శు ధూలియాలతో కూడిన ధర్మాసనం సోమవారం వాదనలు ఆలకించింది.
"ప్రతిఒక్కరికీ మత హక్కు ఉంటుంది. ఏం ఆచరించాలనుకుంటే దాన్ని ఆచరించొచ్చు. కానీ నిర్దిష్ట ఏకరూప దుస్తులనే ధరించాలనే నిబంధన ఉండే పాఠశాలల్లోనూ విద్యార్థులు హజాబ్ ధరించొచ్చా అన్నదే ఇక్కడ ప్రశ్న" అని కొందరు పిటిషనర్ల తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది సంజయ్ హెగ్డేను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. హిజాబ్ ధారణను నిషేధిస్తే.. చాలామంది మహిళలకు విద్యను నిరాకరించినట్లే అవుతుందన్న వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు.
"కర్ణాటక ప్రభుత్వం ఏ హక్కునూ కాదనట్లేదు. నిర్దేశిత ఏకరూప దుస్తుల్లో విద్యాసంస్థలకు రావాలని మాత్రమే చెబుతోంది" అని పేర్కొంది. మరోవైపు- ప్రస్తుత వ్యవహారం కేవలం విద్యాసంస్థల్లో క్రమశిక్షణకు సంబంధించినదేనని అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) కె.ఎం.నటరాజ్ వ్యాఖ్యానించారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ.. "ఒక బాలిక హిజాబ్ ధరిస్తే బడిలో క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు ఎలా అవుతుంది?" అని ప్రశ్నించింది. "హిజాబ్ ధరించే హక్కు తనకు ఉందని.. కాబట్టి పాఠశాలలో క్రమశిక్షణను ఉల్లంఘిస్తానని మతాచారం/మతస్వేచ్ఛ ముసుగులో చెప్పడం సరికాదు" అంటూ ఏఎస్‌జీ బదులిచ్చారు. ఈ కేసులో తదుపరి వాదనలు బుధవారం కొనసాగనున్నాయి.