వయో పరిమితులు, టికెట్ ధరల పెంపు, కరోనా వైరస్ భయాలు హజ్ యాత్రపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఫలితంగా 2021 యాత్రకు ఎక్కువ మంది ముస్లింలు ఆసక్తి చూపట్లేదని హజ్ కమిటీ సభ్యులు చెబుతున్నారు. డిసెంబర్ 10 వరకు గడువు ఉండగా.. దరఖాస్తులు పెద్దగా రావట్లేదని వెల్లడించారు. ఈ మేరకు వేర్వేరు రాష్ట్రాల హజ్ కమిటీ ప్రతినిధులు ఈటీవీ భారత్‌తో మాట్లాడారు.
గతేడాది కంటే దరఖాస్తులు భారీగా తగ్గాయని, కరోనానే ఇందుకు కారణమని చెప్పారు దిల్లీ హజ్ కమిటీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి మొహ్సిన్ అలీ.
''కరోనా కారణంగా హజ్‌కు వెళ్లేందుకు చాలా తక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. ధరల పెంపు కూడా మరో కారణం. ఇది గతేడాది కంటే చాలా తక్కువ. ఇప్పటివరకు దిల్లీ నుంచి 450-500 మంది మాత్రమే హజ్ వెబ్సైట్ నుంచి తమ పేర్లు నమోదు చేసుకున్నారు. డిసెంబర్ 10 నాటికి ఈ సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నాం.''
- మొహ్సిన్ అలీ, దిల్లీ హజ్ కమిటీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి
ఉత్తర్‌ప్రదేశ్ నుంచి దాదాపు 2000 మంది యాత్రికులు హజ్‌కు వెళ్లేందుకు తమ పేర్లు నమోదు చేసుకున్నారని ఆ రాష్ట్ర హజ్ కమిటీ కార్యదర్శి రాహుల్ గుప్తా తెలిపారు.