విద్యార్థుల హ్యాండ్ రైటింగ్ ముత్యాల్లా ఉంటే ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. కానీ.. కంప్యూటర్లు, టచ్ స్క్రీన్లకు అలవాటైన ప్రస్తుత తరం చిన్నారులు.. అందమైన అక్షరాలు రాసేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఉత్తరాఖండ్ బాగేశ్వర్ జిల్లా, కరౌలీ గ్రామంలోని పాఠశాల విద్యార్థులు మాత్రం ఇందుకు భిన్నం. వారు పెన్ను పట్టారంటే.. పేపర్‌పై ముత్యాలు రాలాల్సిందే. అంత అద్భుతంగా అక్షరాలు రాస్తున్నారు.
కరౌలీ జూనియర్ హైస్కూల్లో విద్యార్థుల కోసం ప్రత్యేక క్యాలిగ్రఫీ కోర్సు నిర్వహిస్తున్నారు. టీచర్ల ప్రోత్సాహంతో విద్యార్థులు.. చేతి రాతలో నైపుణ్యం సంపాదిస్తున్నారు. రోజువారీ తరగతులకు హాజరవుతునే.. క్యాలిగ్రఫీ కోసం స్పెషల్ క్లాసులు వింటున్నారు. ప్రతి నిత్యం ప్రాక్టీస్ చేస్తూ చేతి రాతను మెరుగుపర్చుకుంటున్నారు. క్యాలిగ్రఫీలో కొత్త కొత్త మెళకువలు సైతం నేర్చుకుంటున్నారు. హిందీతో పాటు ఇంగ్లిష్ అక్షరాలు సైతం చక్కగా రాసేస్తున్నారు. ఇది చేతిరాతా..? లేదంటే కంప్యూటర్ ద్వారా ప్రింట్ చేశారా? అని అనుమానం వచ్చేంత అద్భుతంగా అక్షరాలు రాస్తున్నారు అక్కడి విద్యార్థులు. ఈ పాఠశాలలో పనిచేసే నరేంద్ర గోస్వామి అనే ఉపాధ్యాయుడికి.. క్యాలిగ్రఫీ శిక్షణలో సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయనే.. విద్యార్థులకు క్యాలిగ్రఫీలో ట్రైనింగ్ ఇచ్చారు. తొలుత విద్యార్థులకు ఇలా అందంగా రాయడం కష్టమైనప్పటికీ.. రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసి నైపుణ్యం సంపాదించారని ఆయన చెబుతున్నారు.
"అందమైన చేతి రాత అనేది ప్రాచీణ కళ. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ఈ కళకు ప్రాభవం తగ్గుతూ వస్తోంది. ఈ కళను సంరక్షిస్తూ భవిష్యత్ తరాలకు అందించే ఉద్దేశంతో.. విద్యార్థులతో కలిసి ఈ కార్యక్రమం ప్రారంభించాం. ప్రస్తుతం విద్యార్థుల హ్యాండ్ రైటింగ్ చూసి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక్కడి విద్యార్థినీ, విద్యార్థులు అందమైన చేతి రాత విషయంలో చాలా మెరుగ్గా ఉన్నారు."
-నరేంద్ర గోస్వామి, కరౌలి జూనియర్ హైస్కూల్ ఉపాధ్యాయుడు
గోస్వామి చేసిన కృషితో.. పాఠశాలలోని దాదాపు అన్ని తరగతుల విద్యార్థుల చేతి రాత అందంగా మారింది. ఇందుకు విద్యార్థులు సైతం చాలా కష్టపడ్డారని గోస్వామి చెబుతున్నారు. క్యాలిగ్రఫీ పోటీల్లో బహుమతులు సైతం తీసుకొస్తున్నారని వెల్లడించారు.