Girl Jumped In Saryu River: ఉత్తర్ప్రదేశ్ అయోధ్యలోని సరయూ నదిలో భాజపా పాలిత రాష్ట్రాలకు చెందిన 12 మంది సీఎంలు పూజలు చేస్తుండగా.. వారికి కొద్ది మీటర్ల దూరంలోనే ఓ యువతి వంతెనపై నుంచి నీటిలోకి దూకింది. నదిలో ఉన్న నావికులు ఇది గమనించారు. వెంటనే సదరు యువతిని రక్షించి బయటకు తీసుకొచ్చారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎస్డీఆర్ఎఫ్ బృందం ఘాట్ వద్దకు చేరుకుంది. యువతిని స్థానిక ఆస్పత్రికి తరలించింది.
"నేను సరయూ నదిలో ఉండగా.. ఒక్కసారిగా శబ్దం వినిపించింది. ఎవరో మహిళ నదిలో దూకినట్లు గమనించాను. వెంటనే నా పడవలో వెళ్లి ఆమెను బయటకు తీసుకొచ్చాను. ఈలోపు ఎస్డీఆర్ బృందం సైతం ఘటనాస్థలికి వచ్చింది." అని యువతిని రక్షించిన నావికుడు అన్ను తెలిపాడు.
యువతి బయటకు రాగానే ఆమె వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించామని పోలీసులు తెలిపారు. కానీ యువతి ఏ ప్రశ్నకూ స్పందించలేదన్నారు. ప్రస్తుతం ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని తెలిపారు.