పసుపు, గోధుమ పంటల గురించి మనకందరికీ తెలిసిందే. అయితే వాటిలోనే నల్ల పసుపు, నల్ల గోధుమలు ఉంటాయని తెలిసిన వారు చాలా అరుదు. ఆ పంటలు అంతరించిపోయే దశలో ఉండటమే అందుకు కారణం. ఇలా అంతరించిపోతున్న పంటలను పునరుద్ధరించడమే లక్ష్యంగా ఒడిశాలోని సంబల్పుర్కు చెందిన దివ్యరాజ్ బెరిహా నడుం బిగించారు. వీటితో పాటు కొత్త రకం విత్తనాల సృష్టికి ప్రయత్నాలు చేస్తున్నారు.
వృత్తి రీత్యా బొటానికల్ శాస్త్రవేత్త అయిన దివ్యరాజ్.. అరుదైన రకానికి చెందిన నల్ల పసుపు, నల్ల గోధుమలను తన ఫాంహౌస్లో విజయవంతంగా సాగు చేస్తున్నారు. వీటితో పాటు కణజాల వర్ధనంపై పరిశోధన జరుపుతున్నారు. వృక్షశాస్త్రంలో ఎంఫిల్ చేసిన దివ్యరాజ్.. బయెఫ్లక్స్ పిసికల్చర్, నల్ల రకం వరిపైనా ఇదివరకు పరిశోధన చేశారు. తాజాగా ఈ నల్ల పసుపు, నల్ల గోధుమ సాగుతో స్థానిక రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒడిశాలో ఈ తరహా పంటలను సాగు చేయడం ఇదే తొలిసారి.
నల్ల రకంతో లాభాలివే!
నల్ల గోధుమలో ఔషధ గుణాలు సాధారణ వాటి కన్నా 20 రెట్లు ఎక్కువ ఉంటాయి. ఇందులో లభించే ఎంతోసియాసిన్.. క్యాన్సర్, కీళ్ల నొప్పులు, ఊబకాయం వంటి సమస్యలను నయం చేస్తుంది. ఈ గోధుమకు ప్రస్తుతం డిమాండ్ పెరుగుతోంది. మార్కెట్లో కేజీ నల్ల గోధుమ పిండి ధర రూ.600 పలుకుతోంది. నల్ల గోధుమ విత్తనాల ధర కేజీ రూ.1200 నుంచి రూ.1500 వరకు ఉంటోంది.