Earthquake In Tamil Nadu : దేశవ్యాప్తంగా గంటల వ్యవధిలోనే నాలుగు రాష్ట్రాల్లో భూకంపాలు సంభవించాయి. అటు గుజరాత్, మేఘాలయతో పాటు దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల్లో కూడా భూప్రకంప కేంద్రాలను గుర్తించింది నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో శుక్రవారం ఉదయం 7:39 గంటలకు రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.2గా నమోదైంది. 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
తిరుపత్తూరు జిల్లాలోని అంబూరు దాని పరిసర ప్రాంతాలైన విన్నమంగళం, పెరియాంకుప్పం, చందోర్‌కుప్పం, కరుంబూరు, అలంకుప్పం, పాలూరుతో పాటు పలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉదయం 7.40 గంటల ప్రాంతంలో స్వల్పంగా భూమి కంపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో కూడా శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 3.9 తీవ్రతతో భూమి కంపించందని చెప్పింది నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ.
కర్ణాటక, మేఘాలయాల్లోనూ భూప్రకంపనలు
మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో కూడా శుక్రవారం ఉదయం 8:46 గంటల సమయంలో 3.8 తీవ్రతతో భూమి కదిలిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. షిల్లాంగ్‌కు నైరుతి దిశలో ఉన్న మాఫ్‌లాంగ్ ప్రాంతంలో 14 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు.