Dominos Pizza Fined: వెజ్ పిజ్జా ఆర్డర్ చేస్తే.. మాంసాహార పిజ్జాను డెలివరీ చేశారని ప్రముఖ రెస్టారెంట్ కంపెనీ డామినోస్పై కేసు వేశాడు ఉత్తరాఖండ్ రూడ్కీకి చెందిన ఓ వ్యక్తి. పోలీస్ స్టేషన్లో న్యాయం జరగకపోగా.. జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. బాధితుడికి.. రూ. 9 లక్షల 65 వేల 918 పరిహారంగా చెల్లించాలని డామినోస్ను ఆదేశించింది.
ఇదీ జరిగింది:రూడ్కీలోని సాకేత్ ప్రాంత నివాసి శివాంగ్ మిత్తల్.. 2020 అక్టోబర్ 26న రాత్రి ఆన్లైన్లో పిజ్జా టాకో(వెజ్ పిజ్జా), చాకో లావా కేక్ ఆర్డర్ చేశాడు. దీని విలువ రూ. 918. ప్యాకెట్‌ను విప్పి చూడగా.. మాంసాహార పిజ్జా అని తెలిసింది. దీంతో అతడు వాంతులు చేసుకున్నాడు. ఆరోగ్యం కూడా క్షీణించింది. వినియోగదారుడు, అతడి కుటుంబం మొత్తం శాకాహారులు.
మాంసాహార పిజ్జాతో.. తమ మతపర మనోభావాలు దెబ్బతిన్నట్లు స్థానిక గంగ్నహర్ రూడ్కీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు బాధితుడు. అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. జిల్లా వినియోగదారుల కమిషన్ తలుపు తట్టాడు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. దీనిలో డామినోస్ కంపెనీ నిర్లక్ష్యాన్ని గుర్తించింది. శాకాహార పిజ్జా ఆర్డర్ చేశాక కూడా.. మాంసాహార పిజ్జా పంపినందున వినియోగదారులకు సరైన సేవలు అందించట్లేదని మండిపడింది.
సదరు బాధితుడు పిజ్జాకు పెట్టిన రూ. 918 ఖర్చుకు 6 శాతం వార్షిక వడ్డీ సహా ఆర్థిక పరిహారంగా రూ.4.5 లక్షలు, ఇతర పరిహారంగా రూ. 5 లక్షలు మొత్తం రూ.9,65,918 నెలలోగా చెల్లించాలని ఆదేశించింది.
ఇవీ చూడండి:ఆన్లైన్లో పిజ్జా ఆర్డర్ చేస్తే.. రూ.11 లక్షలు హాంఫట్!
ఆన్లైన్లో 'చికెన్ టిక్కా పిజ్జా' ఆర్డర్- 2 ముక్కలు తిన్న క్షణాల్లోనే గుండె ఆగి..