పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని కరోనా(covid-19) విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. జనాలు పెద్దగా గుమిగూడకుండా జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తిని అంచనా వేసేందుకు క్రియాశీల చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఈ మేరకు ప్రస్తుతం అమలవుతున్న కరోనా మార్గదర్శకాలను(covid guidelines) సెప్టెంబర్ 30 వరకు పొడగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కరోనా పరిస్థితి జాతీయ స్థాయి(covid in India)లో స్థిరంగానే ఉందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా(ajay bhalla) అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో స్థానికంగా కేసుల పెరుగుదల కనిపిస్తోందని చెప్పారు. పలు జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు ఆందోళనకరంగా ఉందని అన్నారు. దీనిపై అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు లేఖలు రాశారు.
"కేసులు అధికంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు, యూటీల యంత్రాంగాలు.. కట్టడి చర్యలు చేపట్టాలి. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సమర్థవంతమైన చర్చలు తీసుకోవాలి. కేసుల పెరుగుదలను ముందుగానే గుర్తించి.. వ్యాప్తిని అరికట్టాలి. ఇందుకోసం ఆరోగ్య శాఖ సూచించిన క్షేత్రస్థాయి విధానాలు అవలంబించాలి. "
-అజయ్ భల్లా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి
కరోనా నిబంధనలు అమలు చేయడంలో కొంత అలసత్వం కనిపిస్తోందని భల్లా అన్నారు. కరోనాను నివారించడంలో ఈ నిబంధనలను సమర్థంగా అమలు చేయడమే కీలకమని చెప్పారు. టీకా పంపిణీ(vaccination in india)లో గణనీయమైన పురోగతి సాధించామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకొని.. అర్హులందరికీ టీకా అందేలా చూడాలని సూచించారు.