Congress On Ram Temple Opening :అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం ధర్మశాస్త్రాలు, విధివిధానాల ప్రకారం జరగటం లేదని కాంగ్రెస్ ఆక్షేపించింది. ఈ మహాక్రతువును భారతీయ జనతా పార్టీ ఓ రాజకీయ కార్యక్రమంగా నిర్వహిస్తోందని మండిపడింది. నిర్మాణం పూర్తికాకుండా ఆలయాన్ని ప్రారంభించటం మహాపాపమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేడా పేర్కొన్నారు. ఇదే విషయాన్ని దేశంలోని నాలుగు పీఠాల శంకరాచార్యులు చెబితే వారిని పక్కనపెట్టారని తెలిపారు. ఆలయ ప్రారంభ తేదీని పంచాంగం చూడకుండా ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయించారని పవన్ ఖేడా ఆరోపించారు.
"ఆలయ ప్రాణప్రతిష్ఠకు కొన్ని విధివిధానాలు ఉంటాయి. ఇది ధార్మిక కార్యక్రమం అయితే విధివిధానాలు, ధర్మశాస్త్రాల ప్రకారం జరుగుతోందా? నాలుగు పీఠాల శంకరాచార్యుల సలహాలు, మార్గనిర్దేశం ప్రకారం ఈ క్రతువు నిర్ణయించారా? ఆలయ నిర్మాణం పూర్తి కాకుండా ప్రాణప్రతిష్ఠ జరపకూడదని నాలుగు పీఠాల శంకరాచార్యులు స్పష్టం చేశారు. ఇది ధార్మిక కార్యక్రమం కానప్పుడు రాజకీయ కార్యక్రమమే అవుతుంది. ఓ రాజకీయ కార్యక్రమంలో మాకు, మా దేవుని మధ్య రాజకీయ పార్టీ కార్యకర్త మధ్యవర్తిగా ఉంటే మేం వారిని ఎందుకు భరించాలి? ఇంతకుమించిన పాపం లేదు. రామాలయ ప్రారంభోత్సవాన్ని 22వ తేదీన నిర్ణయించారు. బీజేపీ ఏ పంచాంగం చూసి ఆ తేదీ నిర్ణయించింది? ఆ తేదీని ఎంపిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఖరారు చేశారు?" అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేడా ఆరోపించారు.
'మతం అనేది వ్యక్తిగత విశ్వాసం'
అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠకు హాజరుకాకూడదని పార్టీ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం స్పందించారు. 'రామాలయం ప్రారంభోత్సవానికి హాజరుకాకూడదని మా పార్టీ తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నాను. ఇది సరైన నిర్ణయమని నేను భావిస్తున్నాను. మతం అనేది వ్యక్తిగత విశ్వాసమని నేను నమ్ముతాను. అందులో రాజకీయాలను కలపకూడదు. కానీ భారతదేశంలో మతాన్ని రాజకీయం చేయడం దురదృష్టకరం.' అని కార్తీ చిదంబరం అభిప్రాయపడ్డారు.