కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు త్వరలో జరగబోయే సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఎన్నికలను డిజిటల్ విధానంలో నిర్వహించాలన్న ప్రతిపాదనపై నిర్ణయం తీసుకునేందుకు ఆ పార్టీకి చెందిన కేంద్ర ఎన్నికల సంస్థ(సీఈఏ) మంగళవారం భేటీ కానున్నట్టు విశ్వసనీయ వర్గాలు 'ఈటీవీ భారత్'కు తెలిపాయి.
మధుసూదన్ మిస్త్రి కన్వీనర్‌గా ఉన్న సీఈఏలో కృష్ణబైరె గౌడ, అర్విందర్ సింగ్ లవ్లీ, రాజేశ్ మిశ్ర, జ్యోతిమణి సభ్యులుగా ఉన్నారు. మంగళవారం నాటి భేటీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) సభ్యులందరికీ డిజిటల్ కార్డులు జారీ అంశంపై కూడా చర్చించనున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఏఐసీసీ ప్రతినిధుల జాబితాను సీఈఏ తెప్పించుకుంది. డిజిటల్ ఫొటోలను పంపించాలని వారందరికీ సూచించింది. డిజిటల్ ఎన్నికల నిర్ణయం ఖరారయ్యాక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం కూడా తీసుకోవాల్సి ఉంటుంది.