ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు చర్యలు చేపట్టింది కాంగ్రెస్. ఇప్పటికే అసోం ఎన్నికల కోసం స్క్రీనింగ్ కమిటీని నియమించగా.. తాజాగా మిగతా నాలుగు రాష్ట్రాలకూ ఏర్పాటు చేసింది. బంగాల్లో ఎనిమిది దశల్లో జరగబోయే ఎన్నికలకు ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి దిల్లీ కాంగ్రెస్ నాయకుడు జేపీ అగర్వాల్‌ను ఛైర్మన్‌గా నియమించింది. ఈ కమిటీలో మహేశ్ జోషి, నసీమ్ఖాన్లను సభ్యులుగా చేర్చినట్టు ఆ పార్టీ తెలిపింది.
బంగాల్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ఇన్-ఛార్జ్‌గా జితిన్ ప్రసాద్‌ను నియమించిన కాంగ్రెస్.. పీసీసీ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి, సీఎల్పీ నేత అబ్దుల్ మన్నన్లకు కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది.
294 అసెంబ్లీ స్థానాలున్న బంగాల్లో.. ఎనిమిది దశల్లో ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 29 వరకు పోలింగ్ జరగనుంది. ఈ మేరకు వామపక్షాలు, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్)లతో సంకీర్ణంగా బరిలోకి దిగుతోంది కాంగ్రెస్. 92 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది.