అసెంబ్లీ.. ఇందులో ప్రజల సమస్యలు గురించి ఎమ్మెల్యేలు ప్రస్తావిస్తారు. సభ వాటిపై చర్చిస్తుంది. కానీ ఈ అసెంబ్లీలో మాత్రం వెరైటీగా జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో కోడి ముందా..? గుడ్డు ముందా అంటూ ప్రశ్నించి.. నవ్వులు పూయించారో సభ్యుడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో జరిగింది.
అసలు ఏం జరిగిందంటే..
ధరంజిత్ సింగ్.. ఛత్తీస్‌గఢ్‌లోని లోర్మి నియోజకవర్గ ఎమ్మెల్యే. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో పౌల్ట్రీ పరిశ్రమ గురించి ఓ ప్రశ్న లేవనెత్తారు. ఇంతకు ముందు కోళ్లు గోద్రేజ్ కంపెనీ దాణా తినేవి.. రాష్ట్ర ప్రభుత్వం వాటిని మార్చి స్థానికంగా ఉత్పత్తి అయ్యే దాణా ఇస్తోందని.. దాని కారణంగానే కోళ్లకు గుడ్లు పెట్టే సామర్థ్యం తగ్గిపోయిందని ఆరోపించారు. దీంతో గుడ్ల ఉత్పత్తి పడిపోయిందని అన్నారు. 'మంత్రిగారు మీరు మళ్లీ గోద్రేజ్ దాణాను ఇప్పించగలరా' అంటూ ప్రశ్నించారు. ధరంజిత్ సింగ్ వేసిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. 'అయితే ఈ విషయం గురించి కోళ్లతో మాట్లాడతాను' అని చమత్కరించారు. అనంతరం వృద్ధాప్యం కారణంగా కూడా కోళ్లకు గుడ్లు పెట్టే సామర్థ్యం తగ్గిపోవచ్చు.. ఈ విషయాన్ని పరిశీలిస్తాం అని బదులిచ్చారు. సమాధానం పూర్తి కాకుండానే ఎమ్మెల్యే ధరంజిత్ సింగ్ మధ్యలో మాట్లాడుతూ.. 'ఆ కోళ్లన్నీ చిన్నవే' అన్నారు. దీంతో సభలోని సభ్యులందరూ ఘొల్లున నవ్వారు.