సాధారణంగా.. ఎలాంటి వేడుకల్లోనైనా పురుషులే పౌరోహిత్యం చేయడం ఆచారం. అయితే.. త్రిపురలోని ఉదయ్పుర్లో ఓ వివాహం అందుకు భిన్నంగా జరిగింది. వధువు కోరిక ప్రకారం.. మహిళా పూజారుల సమక్షంలో పెళ్లి జరిగింది. నలుగురు పురోహితులు కలిసి ఆచార సంప్రదాయాల ప్రకారం ఘనంగా ఆ వివాహం జరిపించారు.
ఫలించిన వధువు కోరిక..
మార్చి 13న.. ఉదయ్పుర్లో ఈ వివాహం జరిగింది. ఆ సమయంలో యజ్ఞం జరిపించేందుకు పురోహితుడు అందుబాటులో లేడు. ఈ తరుణంలో బంగాల్‌కు చెందిన మహిళా పూజారులు జంధ్యం ధరించి ఘనంగా ఈ కార్యక్రమాన్ని నడిపించారు. బాజాభజంత్రీలతో ఆచార సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిపించారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మహిళా పూజారులు ఇలాంటి వాటిని నిర్వహించవచ్చని తెలిసినా.. ఈ ఘటనతో దాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు ఉదయ్‌పుర్ ప్రజలు. ఇది మహిళా సాధికారత, లింగ సమానత్వానికి సరికొత్త ఉదాహరణగా నిలిచింది. అయితే.. వధువు(బైశాలి భౌమిక్) కోరిక ప్రకారమే.. ఈ విధమైన ఏర్పాట్లు చేసినట్టు ఆమె కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.