తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నడ్డా X రాహుల్​: తారస్థాయికి మాటల యుద్ధం

చైనా, సాగు చట్టాలు, కొవిడ్​-19 వంటి అంశాలను చూపుతూ కేంద్రంపై విమర్శలు చేస్తోన్న రాహుల్​ గాంధీపై ట్విట్టర్​ వేదికగా ధ్వజమెత్తారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఆ వెనువెంటనే నడ్డా ఆరోపణలను తిప్పుకొడుతూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు రాహుల్​. ఈ క్రమంలో ఇరువురి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.

By

Published : Jan 19, 2021, 5:29 PM IST

JP Nadda hits Rahul gandhi
రాహుల్​ గాంధీపై నడ్డా విమర్శలు

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. అరుణాచల్​ ప్రదేశ్​లో చైనా ఓ గ్రామాన్ని నిర్మించినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో జాతీయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు రాహుల్​ గాంధీ. రాహుల్​ విమర్శలను తిప్పికొడుతూ ట్విట్టర్​ వేదికగా ఘాటుగా స్పందించారు నడ్డా. ఈ క్రమంలో ఇరువురి మధ్య చిన్నపాటి యుద్ధమే నడిచింది.

"చైనా విషయంలో దుష్ప్రచారం చేయటం కాంగ్రెస్​ ఎప్పుడు మానుకుంటుందో చెప్పాలి. నాటి ప్రధాని జవహర్​లాల్​ నెహ్రూనే అరుణాచల్​ ప్రదేశ్​లోని వేల కిలోమీటర్ల ప్రాంతాలను చైనాకు కానుకగా ఇచ్చారన్న నిజాన్ని కాంగ్రెస్ ఒప్పుకోగలదా? కాంగ్రెస్​ ఇంకా ఎన్ని సార్లు డ్రాగన్ దేశం ముందు లొంగిపోతుంది? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు స్వామినాథన్ కమిటీ సిఫార్సులను ఎందుకు పట్టించుకోలేదు? కనీస మద్దతు ధరను మీరు ఎందుకు పెంచలేదు? '

- జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

రాహుల్​.. విద్వేషభరిత ప్రసంగాలతో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు నడ్డా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వారికి రైతులు గుర్తొస్తారని చురకలు అంటించారు. 'చైనాతో కాంగ్రెస్​ పార్టీ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని రాహుల్​ భావిస్తున్నారా? గాంధీ కుటుంబం నడుపుతున్న ట్రస్ట్​లకు చైనా కానుకగా ఇచ్చిన ఆస్తులను తిరిగివ్వాలనుకుంటున్నారా?' అని ప్రశ్నించారు.

రాహుల్​ ఎదురుదాడి..

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలను తిప్పికొట్టారు రాహుల్​. జాతీయ భద్రత, సాగు చట్టాలు, చైనా వంటి కీలక అంశాలపై ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నమేనని పేర్కొన్నారు. ఉత్తర్​ప్రదేశ్​ గ్రేటర్​ నోయిడాలోని భట్టా పార్సాల్​లో భూసేకరణ వివాదంలో రైతులకు మద్దతుగా నిలిచింది రాహుల్​ గాంధీయేనని, భాజపా నేత నడ్డా కాదని రైతులకు తెలుసునన్నారు.

" నేను ఎవరికీ భయపడటం లేదు. అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావచ్చు, మరెవరైనా కావచ్చు. నేను సచ్ఛీలుడను. వారు నన్ను తాకలేరు. నేను నిజమైన దేశభక్తుడిని. నా దేశాన్ని కాపాడుకుంటా. అందుకోసం పోరాటం కొనసాగిస్తా. "

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత

అంతకు ముందు.. కేంద్రం తెచ్చిన మూడు చట్టాలు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నాశనం చేస్తాయని ఆరోపించారు రాహుల్​. రైతుల సమస్యకు ఏకైక పరిష్కారం సాగు చట్టాలను రద్దు చేయటమేనన్నారు. సాగు చట్టాలతో కలిగే నష్టాలను వివరిస్తూ కాంగ్రెస్ రూపొందించిన బుక్​లెట్​ను దిల్లీలో విడుదల చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు రాహుల్​. నిజాన్ని దాచిపెట్టి, కేంద్రం దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. ఈ చట్టాలు మొత్తం వ్యవసాయ రంగాన్ని ముగ్గురి నుంచి నలుగురు పెట్టుబడిదారుల చేతుల్లోకి తీసుకెళతాయని విమర్శించారు. తాను వంద శాతం రైతులకు మద్దతిస్తున్నానని, దేశంలోని ప్రతిఒక్కరు మద్దతివ్వాలని సూచించారు.

ఇదీ చూడండి:బంగాల్​ బరి: 'నందిగ్రామ్' వ్యూహంతో ఎవరికి లాభం?

ABOUT THE AUTHOR

...view details