‘ఉద్యోగం పొందడానికి అవసరమైన నైపుణ్యాలు లేకుండానే భారత్‌లోని విద్యార్థుల్లో 56 శాతం కళాశాలల నుంచి బయటికి వస్తున్నారు. కొలువుల కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. శిక్షణ లోపం, కళాశాలల్లో ఉపాధికి సంసిద్ధం చేయకపోవడం, ఆచరణాత్మక అభ్యసనం లేకపోవడం వంటి లోపాల వల్లనే ఈ పరిస్థితి ఉత్పన్నమవుతోంది’ అని తాజాగా విడుదలైన ‘యునిసెఫ్’ సర్వే పేర్కొంది. భారతీయ విద్యారంగం, ఉపాధి వ్యవస్థల దుస్థితిని ఈ అధ్యయనం తేటతెల్లం చేసింది. 21వ శతాబ్దంలో యువతను తీర్చిదిద్దేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు కృషి చేస్తుండగా, భారత్‌లో ఈ తరహా మార్పు కనిపించడం లేదు. భారత్‌లో చదువు పూర్తయినవారిలో 24 శాతమే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధిని పొందుతున్నారు. 76 శాతం పనుల కోసం నిత్యం అన్వేషిస్తున్నారు. ఉద్యోగాలు, ఆదాయ వనరులు లేకపోవడం వల్ల కోట్లమంది పేదరికంలో ఉన్నారు. దీనిద్వారా ఆర్థికాభివృద్ధి క్షీణిస్తోంది. యువతలో నైరాశ్యానికి దారి తీస్తోంది. అశాంతికి కారణమవుతోంది. తాజా సర్వే ప్రకారం విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లోని 44 శాతం విద్యార్థులే ఉత్తీర్ణత సాధిస్తున్నారు. బయటికి వచ్చాక ఉద్యోగాల సాధన అతిపెద్ద సమస్యగా మారింది.
నైపుణ్యాభివృద్ధి...!
స్వాతంత్య్రం వచ్చిన 67 సంవత్సరాల తరవాత దేశంలో జాతీయ నైపుణ్యాభివృద్ధి మిషన్ మొదలైంది. ఎన్డీయే ప్రభుత్వం 2014లో నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. దీనికి లక్ష్యాలు పరిమితంగానే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ కార్యక్రమాల కింద ఏటా కోటిమంది యువకులకు నైపుణ్య శిక్షణను నిర్దేశించారు. జనాభా అవసరాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. కేంద్రప్రభుత్వ కార్యక్రమాలు శిక్షణకు పరిమితమయ్యాయి. అవి పూర్తిస్థాయిలో అందలేదు. దేశవ్యాప్తంగా విద్యావిధానం, పాఠ్యాంశాల మార్పులు అనివార్యమైనా, కేంద్రం వాటివైపు దృష్టి సారించడం లేదు. ప్రయోగాత్మక, ఆచరణాత్మక విద్యలను పట్టించుకోవడం లేదు. పరిశ్రమలను విద్యాసంస్థలతో అనుసంధానం చేయడం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అమలవుతోంది. మన దేశంలో అది మొక్కుబడి తంతుగా ఉంది. కేవలం 2.9 శాతం పరిశ్రమలు మాత్రమే విద్యాసంస్థలకు అనుసంధానంగా ఉన్నాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దీన్ని తప్పనిసరి చేయడానికి వెనకాడుతున్నాయి. పారిశ్రామిక సంస్థలు రాయితీలను ఆశించి, అనుసంధానానికి షరతులు విధిస్తున్నాయి. విద్యాసంస్థల నిర్వాహకులు- అనుసంధానం వల్ల తమకు అదనపు భారం పెరుగుతుందనే భావనలో ఉన్నారు. దీనివల్ల ఈ ప్రక్రియ ఆశించిన స్థాయిలో కొనసాగడం లేదు. యువత స్వయంఉపాధికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. బ్యాంకుల నుంచి పెట్టుబడికి సహకారం అందడం లేదు. ప్రభుత్వాలు నేరుగా నిధులు ఇవ్వడం లేదు. రాయితీలు ఉన్నా పెట్టుబడికి మూలధనం సమస్యగా మారింది.
విద్యాసంస్థల వైఫల్యం
ఉపాధిరంగం విద్యావ్యవస్థతో ముడివడి ఉంటుంది. ఇండియాలోని సాధారణ విద్యాసంస్థల్లో నైపుణ్య శిక్షణ ఊసే లేదు. ఉపాధి కల్పనపై దృష్టి సారిస్తున్న దాఖలాలు లేవు. వృత్తివిద్యకు సంబంధించిన ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)లు పూర్తిగా ఉపాధి ఆధారిత కోర్సులనే అందిస్తున్నాయి. వీటిలో సాంప్రదాయక బోధనే సాగుతోంది. ఇంజినీరింగ్ పట్టభద్రుల్లో 69 శాతం నిరుద్యోగులుగా ఉంటున్నారు. పాలిటెక్నిక్‌లో ఉత్తీర్ణత సాధించిన 54 శాతం, ఐటీఐ పూర్తయిన 42 శాతం మంది ఉపాధి పొందడం లేదు. దేశంలో ఐటీఐల సంఖ్య 2014లో 11,964 ఉండగా; 2018-19 నాటికి వాటి సంఖ్య 14,939కు పెరిగింది. శిక్షణార్థుల సంఖ్య 16.90 లక్షల నుంచి 23.08 లక్షలకు చేరింది. ఇదే సమయంలో వీటిద్వారా ఉపాధి పొందలేనివారి శాతమూ అధికం కావడం ఆందోళనకర పరిణామం. ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐలు పూర్తి చేసినవారికి అప్రెంటిసష్‌ిప్ శిక్షణ ద్వారా ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. కానీ, వృత్తివిద్య పూర్తి చేసినవారిలో 90 శాతానికి ‘అప్రెంటిసష్‌ిప్’ లభించడం లేదు. 314 పారిశ్రామిక శిక్షణ సంస్థల పనితీరును ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపరచేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. బోధకులకు ఆధునిక శిక్షణ ఇవ్వడం, మౌలిక వసతుల కల్పన దీని లక్ష్యాలు. దానికి అవసరమైన నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఈ పథకం కాగితాలకే పరిమితమైంది. యువతకు ఉచిత నైపుణ్యశిక్షణ కోసం ప్రధానమంత్రి నైపుణ్యాభివృద్ధి పథకం (పీఎమ్‌కేవీవై) పథకం 2015లో ప్రారంభించారు. 812 శిక్షణ కేంద్రాలు మంజూరు కాగా అందులో 681 కేంద్రాలు మాత్రమే ఏర్పాటయ్యాయి. దీనికి కేంద్రం భారీగా నిధులు విడుదల చేసింది. ఈ పథకం నిర్వాహకుల పాలిట వరంగా మారింది. ఇప్పటివరకు 87 లక్షల మంది వీటిలో శిక్షణ పొందినట్లు నమోదు చేశారు. వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. గతంలో శిక్షణ పొందినవారే మళ్ళీ చేరుతున్నారు. శిక్షణ భృతి కోసమే చాలామంది ఆసక్తి చూపుతున్నారు. శిక్షణ పొందినవారిలో 54 శాతం ఉపాధి పొందినట్లు చెబుతున్నారు. మిగిలిన 46 శాతం నిధులు వృథా అయినట్లు పరిగణించాలి. సింగపూర్, జపాన్, కెనడా, ఆస్ట్రేలియా, యూఏఈలలో అమలులో ఉన్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ విధానాల అమలుకు ఒప్పందాలు చేసుకున్నా- అవి కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. చైనా, జపాన్‌లలో విద్యాసంస్థల్లో మాధ్యమిక స్థాయి నుంచి నైపుణ్య శిక్షణ ఉంటోంది. స్పెయిన్‌లో విద్యార్థులకు కృత్రిమ మేధ, రోబొటిక్స్, డేటా ఎనలిటిక్స్, బ్లాక్ చైన్ వంటి ఆధునిక విధానాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్య శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. కొరియాలో విద్యాసంస్థలన్నింటిలో ప్రయోగశాలలు, నూతన ఆవిష్కరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పురోగతి ఎక్కడ?