రైతులు, చైనా, జాతీయ భద్రతకు సంబంధించి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంధించిన ప్రశ్నలపై రాహుల్ గాంధీ స్పందించారు. తాను నడ్డాకు జవాబుదారీ కాదని, దేశ ప్రజలు, రైతులు అడిగే విషయాలకే సమాధానం చెబుతానని అన్నారు.
" జేపీ నడ్డా ఎవరు? ఆయనేమైనా నా ప్రొఫెసరా? దేశానికి టీచరా? ఆయన అడిగే వాటికి నేనెందుకు సమాధానం చెప్పాలి? నేను దేశ ప్రజలకు, రైతులకు మాత్రమే జవాబుదారీ. వారు నన్ను ఏమైనా అడగొచ్చు. నేను సమాధానం చెబుతా."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
అంతకు ముందు మాటల యుద్ధం..
జేపీ నడ్డా, రాహుల్ గాంధీల మధ్య మంగళవారం మాటల యుద్ధం జరిగింది . ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా ఓ గ్రామాన్ని నిర్మించినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో జాతీయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు రాహుల్. ఈ విమర్శలను తిప్పికొడుతూ నడ్డా.. ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య చిన్నపాటి యుద్ధమే నడిచింది.
రాహుల్.. విద్వేషభరిత ప్రసంగాలతో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు నడ్డా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వారికి రైతులు గుర్తొస్తారని చురకలు అంటించారు. 'చైనాతో కాంగ్రెస్ పార్టీ చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని రాహుల్ భావిస్తున్నారా? గాంధీ కుటుంబం నడుపుతున్న ట్రస్ట్‌లకు చైనా కానుకగా ఇచ్చిన ఆస్తులను తిరిగివ్వాలనుకుంటున్నారా?' అని ప్రశ్నించారు.
ఇదీ చూడండి: నడ్డా X రాహుల్: తారస్థాయికి మాటల యుద్ధం