తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పూజలందుకొంటున్న స్వాతంత్ర్యం నాటి 'పత్రికలు' - సత్యయారా లో ప్రజలు

దేవుళ్లకు పూజలు చేయడం ఆనవాయితి. నటులకు దేవాలయాలు కట్టడం ఫ్యాషన్​. మరి రోజు చదివే వార్తా పత్రికలకు గుడి కట్టి.. పూజలు చేయడాన్ని ఏమంటారు? ఛత్తీస్‌గఢ్‌లోని దంతరి జిల్లాలో చేసే ఈ వింత ఆచారాన్ని చూస్తే ఎవరైనా కచ్చితంగా దేశభక్తి అని అనాల్సిందే. కారణం ఏంటో తెలుసుకోవాలి అంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

villagers offer prayers to news newspaper in Chandigarh
పూజలందుకొంటున్న స్వాతంత్ర్యం నాటి పత్రికలు

By

Published : Dec 10, 2020, 7:59 AM IST

పూజలందుకొంటున్న స్వాతంత్ర్యం నాటి పత్రికలు

ఛత్తీస్‌గఢ్‌లోని దంతరి జిల్లా కేంద్రానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న సత్యయారా గ్రామంలో ఓ వార్తాపత్రికకు పూజలు చేసే వింత ఆచారం ఉంది. 1947, ఆగష్టు 15న మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్న విషయాన్ని ఆ ఊరి ప్రజలకు తెలియజేసిన వార్తాపత్రికే ప్రస్తుతం విశేష పూజలందుకుంటోంది. దేశం స్వతంత్ర భారతావనిగా మారిందన్న వార్త... నెలన్నర తరవాత గానీ ఆ గ్రామస్థులకు తెలియలేదు. ఆ విషయం తమకు తెలియజెప్పిన పత్రికను పవిత్రంగా భావిస్తారు.

ఆనకట్టకు సమీపంలో ఊరు ఉండడం వల్ల....సమాచారం చేరేందుకు ఏ దారీ అంత సులభంగా ఉండేది కాదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతా పరిస్థితిలో మార్పు రాలేదు. దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్న విషయం కూడా ఒకటిన్నర నెలల తర్వాత...పడవలో మా ఊరికి వచ్చిన పత్రిక ద్వారా తెలిసింది.

-జునైద్ రిజ్వీ, సబ్‌ ఎడిటర్, నవభారత్

జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటం ముద్రించిన పత్రికతో పాటు...గాంధీజీకి కూడా గుడికట్టారు. ఏటా స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఈ ఊర్లో ఘనంగా సంబరాలు జరుపుకుంటారు. ఆనకట్ట నిర్మాణం కారణంగా ఊరు విడిచి పోయిన గ్రామస్థులు... పక్క ఊర్లో మరో గుడి నిర్మించారు. యువతీయువకుల్లోనూ ఎప్పటికప్పుడు దేశభక్తి, దేశం పట్ల బాధ్యతను నూరిపోస్తారు. గుడిలో తమ సమస్యల గురించి చర్చించుకోవడమే కాక, సత్య మార్గంలోనే నడవాలని ప్రతిజ్ఞ చేసుకుంటారు.

శ్రీరామచంద్రుడు, కృష్ణభగవానుడి లాగే....ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలన్న సంకల్పంతో ఊర్లో ఆలయ నిర్మాణం చేపట్టాం. సమాజంలో దుర్మార్గాలకు పాల్పడకుండా ఒకరిని మరొకరు అడ్డుకోవడమే గుడి కట్టడం వెనక మా ఉద్దేశం.

-కాంతాప్రసాద్, గాంధీ సేవాసమితి సభ్యుడు

అసలైన గుడి 1947లోనే నిర్మించారు. గంగ్రాయెల్ డ్యాం నిర్మించిన తర్వాత...ఆ ఊరి ప్రజలంతా వలస వెళ్లారు. నది ఒడ్డున 1990లో మరో ఆలయం కట్టుకున్నారు. అప్పటినుంచి గాంధీ మహాత్ముడితోపాటు... వార్తాపత్రికను కూడా వాళ్లు కొలుస్తున్నారు. ఏటా పంద్రాగష్టు, జనవరి 26న వేడుకలు ఘనంగా జరుపుకుంటారు.

మా ఊర్లో రేడియో ఉండేది కాదు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్న విషయం మాకు వార్తాపత్రిక ద్వారానే తెలిసింది. అందుకే దాన్ని మా గ్రామంలో ఇప్పటికీ పూజిస్తాం.

-లోకేశ్ సాహు, స్థానికుడు

దేశానికి స్వాతంత్ర్యం తెచ్చేందుకు పోరాడిన నేతలంతా....సమాచారం చేరవేసేందుకు వార్తా పత్రికలు వినియోగించుకునేవారు. హరిజన్, యంగ్ ఇండియా వార్తాపత్రికలను గాంధీజీ ప్రచురించేవారు. ఆ రెండూ స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర పోషించాయి. తమకు శుభవార్త మోసుకొచ్చిన పత్రికకు ఏకంగా పూజలు చేయడం..ఆ గ్రామస్థులలోని దేశభక్తికి అద్దంపడుతోంది.

ఇదీ చూడండి: అటవీ సంరక్షణలో 'అతడే ఒక సైన్యం'

ABOUT THE AUTHOR

...view details