తమిళనాడు అంటే ముందుగా గుర్తొచ్చేది జల్లికట్టు. ఈ ఆట కోసం అక్కడి వారు ప్రాణాలను సైతం లెక్కచేయరు. అందులో పాల్గొనే ఎద్దులను ఎంతో అపురూపంగా చూసుకుంటారు. జల్లికట్టులో పాల్గొన్న ఓ వృషభం చనిపోతే.. గ్రామస్థులంతా కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉన్నా.. ప్రాణాలమీదకు వస్తుందని తెలిసినా సుమారు 2వేలమంది హాజరయ్యారంటే వారికి ఆ ఎద్దుపై ఎంత మక్కువ ఉందో అర్థమవుతోంది. ఈ నెల 12న జరిగిన ఈ కార్యక్రమం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఇదీ జరిగింది
ముదువరపట్టి గ్రామంలోని చెల్లాయి అమ్మాన్ ఆలయంలో ఉండే మూలి అనే ఎద్దు ఏప్రిల్ 12న మదురై నగర శివారులో మృతి చెందింది. ఈ వార్త తెలుసుకున్న గ్రామస్థులు కంటతడి పెట్టుకున్నారు. లాక్డౌన్ ఉన్నప్పటికీ.. ఆ వృషభానికి అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. గ్రామపెద్దలు, ఆలయ సిబ్బంది.. చనిపోయిన ఎద్దును పూలమాలలతో అలంకరించి గ్రామ నడిబొడ్డున ప్రదర్శనకు ఉంచారు. గ్రామస్థులంతా అక్కడికి వెళ్లి నివాళులర్పించారు. అనంతరం టపాసులు పేల్చుతూ.. డప్పుచప్పుళ్లతో ఊరేగింపు నిర్వహించి అంత్యక్రియలు పూర్తి చేశారు.
పోలీసుల చర్యలు..
సామాజిక మాధ్యమాల ద్వారా ఎద్దు అంత్యక్రియల విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇంత మంది గుమిగూడటంపై చర్యలు చేపట్టారు. అంత్యక్రియలు నిర్వహించిన గ్రామపెద్దలు సహా ఏడుగురిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.