తెలంగాణ

telangana

By

Published : Mar 24, 2019, 9:31 AM IST

ETV Bharat / bharat

విదేశాంగ విధానంలో మోదీకి ఎన్ని మార్కులు?

ఆరు ఖండాలు.... 59 దేశాలు...! ఐదేళ్లలో నరేంద్రమోదీ విదేశీ పర్యటనల వివరాల సంక్షిప్త రూపమిది. ప్రధాని ప్రపంచం మొత్తాన్ని చుట్టేయడం వెనుక ఆంతర్యమేంటి? సాధించిందేంటి? డోక్లాం చొరబాటు, పఠాన్​కోట్​, పుల్వామా దాడులు ఏం చెబుతున్నాయి?

విదేశాంగ విధానంలో మోదీకి ఎన్ని మార్కులు?

విదేశాంగ విధానంలో మోదీకి ఎన్ని మార్కులు?

ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడి...! ప్రతీకారంగా ఫిబ్రవరి 26న భారత్​ మెరుపుదాడి...! ఆ తర్వాత ఎన్నో ఉద్రిక్త, నాటకీయ పరిణామాలు. చివరకు... ఎన్నికల వేళ రాజకీయాలు.
దాడి చేసినవారి పనిబట్టామన్నది అధికార పక్షం వాదన. అసలు సూత్రధారిని ఏమీ చేయలేకపోయారని విపక్షం విమర్శ. మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు చైనా అడ్డుపడుతున్నా... ఎందుకు చూస్తూ ఊరుకుంటారని ప్రశ్న.

పుల్వామా ఉగ్రదాడిపై మొదలైన రాజకీయం... ఎన్డీఏ ఐదేళ్ల పాలనలో అనుసరించిన విదేశాంగ విధానంపై చర్చకు దారితీసింది. ఇంతకీ.... మోదీ సర్కారు దౌత్యపరంగా ఎలాంటి పనితీరు కనబరిచింది. ఈ ప్రశ్నకు జవాబుకోసం... దిల్లీ కేంద్రంగా పనిచేసే 'అబ్జర్వర్​ రీసెర్చ్ ఫౌండేషన్​' సంచాలకుడు హర్ష్​.వి.పంత్​తో మాట్లాడింది ఈటీవీ భారత్​.

మోదీ విదేశాంగ విధానంపై మీ అభిప్రాయం?

అన్ని విధానాల తరహాలోనే విదేశాంగ విధానంలోనూ జయాపజయాలు ఉన్నాయి. మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు ఉన్న అంచనాల కంటే మెరుగైన ప్రదర్శన చేసిన రంగాల్లో విదేశాంగ విధానం ఒకటి. అంతర్జాతీయ వేదికలపై ప్రత్యేకతను చాటుకోవటం సహా భారత దేశ విశ్వసనీయతను పెంచటంలో తమదైన ముద్ర వేశారు.

విదేశాంగ విధానంలో మోదీ ముందు వరుసలో ఉన్నారని, మంత్రి పరిమితి పాత్రే పోషించారని పలు నివేదికలు చెబుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయం?

భారత్​లో ఇది అసాధారణం అని అనుకోవట్లేదు. మనం ఇప్పటికీ నెహ్రూ విదేశాంగ విధానాన్ని చర్చిస్తూ ఉంటాం. నెహ్రూ కాలంలో పనిచేసిన విదేశాంగ మంత్రులు చాలా మందికి తెలియదు. మన దేశ విదేశాంగ విధానానికి సంబంధించి ప్రధాన మంత్రుల పాత్రే ఎక్కువ అని చెప్పుకోవచ్చు. మన్మోహన్‌ సింగ్‌ హయాంలోనూ... భారత్‌-అమెరికా అణు ఒప్పందం విషయంలో ఆయన అనుసరించిన తీరు చెప్పుకోదగినది. ఒప్పందం కుదరకపోతే రాజీనామా చేస్తానని అన్నారు. భారత విదేశీ విధానంలో ప్రధాని పాత్ర కీలకం. దీనినే మోదీ కొనసాగించారు.

విదేశాంగ విధానంలో మోదీ ఎక్కువ కనిపించడానికి కారణాల్లో ఒకటి... ఆయన వ్యక్తిగత శ్రద్ధ. భారతదేశం ఒకప్పటి కంటే శక్తిమంతంగా తయారైంది. మన దేశ నాయకుడిగా ప్రధాని.. గతంలో కంటే ఎక్కువ వేదికలపై కనిపించాల్సి ఉంటుంది.

అమెరికా, ఐరోపా లాంటి పశ్చిమ దేశాలతో సంబంధాలు మరో స్థాయికి చేరుకున్నాయి. కానీ ఆసియాలో ఎప్పటి నుంచో ఉన్న చైనా, మాల్దీవుల సమస్య ఇంకా సమసిపోలేదు. ఇటీవలే విదేశాంగ మంత్రి మాల్దీవుల్లో పర్యటించారు. మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న విషయంలో చైనా వీటోను ఉపయోగించింది. ప్రభుత్వ విధానమైన 'యాక్ట్‌ ఈస్ట్‌'ను సరిగ్గా అమలు చేయగలిగిందా?

చైనా ప్రభావం పెరగటం భారత విదేశాంగ విధానంలో పెద్ద సవాలు. ఇది సమీప భవిష్యత్తులోనూ కొనసాగనుంది. గతంలోనూ ఈ సమస్య ఉంది. యాక్ట్‌ ఈస్ట్‌ అనేది చైనా ప్రభావం మనపై పడకుండా చూసుకోవటంలో భాగమే. ఈశాన్య ఆసియాతో సంబంధాలు ఎంత బాగా ఉంటే అంత మంచిగా చైనా ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఇది కొంత వరకు జరుగుతోంది. ప్రభుత్వం రెండు రకాల పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి దేశీయంగా ఆర్థిక, సైనిక సామర్థ్యం పెంచటం. రెండోది దౌత్యపరంగా దేశాలతో భాగస్వామ్యాలను ఏర్పరచుకోవటం. ఆసియాన్‌, తూర్పు ఆసియా దేశాలతో సంబంధాలు యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీలో ఒక భాగం. ప్రస్తుతం ప్రభుత్వం సాధించిన విజయాల్లో ఒకటి.... ఆగ్నేయాసియా, తూర్పు ఆసియాతో మైత్రి విషయంలో కొత్త వ్యూహాన్ని తీసుకురావటమే.

కొత్తగా వచ్చే ప్రభుత్వం నుంచి విదేశాంగ విధానంలో ఆశించేవి ఏంటి?

ప్రభుత్వంతో పాటు విదేశాంగ విధానం ఎప్పటికప్పుడు మారదు. ఏ ప్రభుత్వం వచ్చినా అవే సమస్యలు కొనసాగుతాయి. ఇప్పటికే చైనా సమస్యపై చర్చించాం. చైనా ప్రభావం దక్షిణాసియాలో వేగంగా పెరుగుతోంది. వ్యూహాత్మక ప్రాంతాలైన దక్షిణాసియా, హిందూ మహా సముద్రంలో భారత్​ ప్రాబల్యం పెరుగుతోంది. మాల్దీవుల సమస్య.., శ్రీలంక, బంగ్లాదేశ్‌తో చైనా సంబంధాలు..., భూటాన్‌, నేపాల్‌లో చైనా కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఈ దేశాలతో సంబంధాలను కాపాడుకోవటానికి భారత్‌ ఏం చేయాలి? దక్షిణాసియా, హిందూ మహా సముద్రంలో భారత ప్రయోజనాలకు చైనా అడ్డంకి కాకుండా చూసుకోవాలి. ఇది కొత్త ప్రభుత్వానికి ఉండే సవాలు.

పాకిస్థాన్‌ సమస్య ఉండనే ఉంది. మెరుపుదాడులు చేసి మోదీ ప్రభుత్వం కొన్ని వారాల్లో ఉద్రిక్తతలను మరో స్థాయికి తీసుకెళ్లింది. పాక్‌ విషయంలో ఒక దాడి సరిపోతుందని చెప్పలేం. పాక్‌ మద్దతిస్తున్న ఉగ్రవాదం ప్రభావం భారత్‌పై కొనసాగనుంది. ఇది పాకిస్థాన్‌ వ్యూహం. పాకిస్థాన్‌ విషయంలో భారత్‌ దృక్కోణంపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించాలి.

మనం భారతదేశం ప్రపంచ శక్తి అని మాట్లాడుకుంటాం. దీని అర్థం ఏంటి? ప్రపంచంలో భారత్‌ ఎలాంటి పాత్రను పోషించాలనుకుంటుంది? అన్నవి ముఖ్యం. ఏ ప్రభుత్వం వచ్చినా దీనిపై ఆలోచించాలి. అంతర్జాతీయంగా భారత్‌ది నాయకత్వ పాత్ర అని... ప్రపంచ గమనాన్ని నిర్దేశిస్తుందని, లోపాలను సరిదిద్దుతుందని మోదీ అన్ని దేశాలకు తెలిపారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ చర్చను ఎలా కొనసాగించాలి? అన్న దానిపై దృష్టి సారించాలి. సవాళ్లు ఎప్పటిలాగే ఉండనున్నాయి. వీటిపై ఏ విధంగా వ్యవహరిస్తామన్నదే ప్రశ్న.

ABOUT THE AUTHOR

...view details