కాంగ్రెస్‌ను గాంధీ ఆనాడే రద్దు చేయమన్నారు సార్వత్రిక ఎన్నికల వేళ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముందు చూపుతోనే జాతిపిత మహాత్మా గాంధీ కాంగ్రెస్‌ను రద్దు చేయాలని ఆనాడే సూచించారని వెంకయ్య అన్నారు. మోదీ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు ఉపరాష్ట్రపతి. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక కీలక సంస్కరణలు చేపట్టారని కొనియాడారు. మోదీ సర్కారు ప్రవేశపెట్టిన సులభతర వాణిజ్య విధానాన్ని ప్రపంచ బ్యాంకు మెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు వెంకయ్య.
ముంబయిలోని ఇందిరా గాంధీ పరిశోధన, అభివృద్ధి సంస్థ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మహాత్మా గాంధీ ముందుచూపు గల గొప్ప నాయకుడు. స్వాతంత్ర్యం తరువాత ఆయన రెండు సూచనలు చేశారు. అందులో మొదటిది కాంగ్రెస్‌ను రద్దు చేయాలి. విభిన్న నేపథ్యాలు ఉన్న అనేక మంది నాయకులు కాంగ్రెస్‌లో చేరి స్వాతంత్ర్యం కోసం పోరాడారు. స్వేచ్ఛ సిద్ధించింది ఇక పార్టీని రద్దు చేసి ఎవరికివారు సొంత పార్టీలు ప్రారంభించుకోవాలని ఆయన తెలిపారు. ఇది ఇప్పుడు మాట్లాడాల్సిన అంశం కాదు. నేను ప్రస్తుతం రాజకీయాల్లో లేను, రాజకీయాల గురించి మాట్లాడాలనుకోవటం లేదు.- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి
గ్రామాల అభివృద్ధి గాంధీ చేసిన రెండో సూచన అని పేర్కొన్నారు వెంకయ్య. మోదీ ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించారు. సులభతర వాణిజ్య విధానం, మేక్- ఇన్-ఇండియా, జీఎస్టీ, నోట్ల రద్దు, జన్‌ధన్ యోజన లాంటి అద్భుత పథకాలను మోదీ ప్రవేశపెట్టారని వెంకయ్య కొనియాడారు.