ఉత్తర్‌ప్రదేశ్‌లో 'పౌర' నిరసనలు గత కొన్ని రోజులుగా ఉద్ధృతంగా సాగుతున్నాయి. నిరసనల్లో ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ హెచ్చరించిన కొద్ది రోజులకే అధికారులు ఆ దిశగా అడుగులు వేశారు. విధ్వంసకారుల వల్ల ధ్వంసమైన ఆస్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఇందుకోసం నలుగురు సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు లఖ్‌నవూ జిల్లా పరిపాలనాధికారి. ధ్వంసమైన ఆస్తికి సమానమైన పరిహారాన్ని నిరసనకారుల నుంచే వసూలు చేసేలా చర్యలు తీసుకోనుందీ కమిటీ.
'పౌర' నిరసనకారులపై యూపీ ప్రభుత్వం 'ప్రతీకారం' - yogi adithyanath on Anti-CAA protestors
ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం నిరసనకారులపై 'ప్రతీకారం' తీర్చుకునేందుకు సిద్ధమైంది. నిరసనల పేరిట ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినవారిపై చర్యలు చేపడుతోంది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఆస్తి నష్టాలను అంచనా వేసేందుకు లఖ్‌నవూలో నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. విధ్వంసం సృష్టించిన వారిని గుర్తించి, వారి ఆస్తులను వేలం వేయాలని నిర్ణయించింది.
"సీసీటీవీ దృశ్యాల ఆధారంగా గోరఖ్‌పుర్ పోలీసులు 50 మంది విధ్వంసకారుల చిత్రాలను గుర్తించారు. అన్ని చౌరస్తాల్లో, ముఖ్యమైన ప్రదేశాల్లో వారి చిత్రాలను అతికిస్తాం."
-వీపీ సింగ్, కోత్వాలీ సర్కిల్ ఆఫిసర్.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో యూపీలో దాదాపు 16 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక స్థిర, చరాస్తులు ధ్వంసమయ్యాయి. నిరసనకారుల ఆస్తులను వేలం వేసి నష్టపరిహారం వసూలు చేస్తామని ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
ఇదీ చదవండి:'పిల్లలు ఆడుకునే బొమ్మలు 67% ప్రమాదకరమైనవే'